అమర్ నాథ్ యాత్రను అధికారులు శనివారం తాత్కాలికంగా నిలిపి వేశారు. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి నాలుగేండ్లు అవుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా యాత్రను నిలిపి వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. యాత్ర కోసం ఈ రోజు వందలాది మంది భక్తులు బేస్ క్యాంపు వద్దకు వచ్చారు. కానీ యాత్రను నిలిపి వేసినందున ఈ రోజు అక్కడే వుండాలని భక్తులకు సూచించారు.
ఇక అమర్ నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య గత వారం రోజులుగా తగ్గుతోందన్నారు. దీంతో ప్రతి రోజు కాకుండా రోజు విడిచి రోజు భక్తులను జమ్ము నుంచి శ్రీనగర్ వరకు కాన్వాయ్ లో తీసుకు వెళ్లాలని ఆలోచనలో వున్నట్టు పేర్కొన్నారు. జూలై 1 నుంచి ఇప్పటి వరకు సుమారు 4.15 లక్షల మంది అమర్ నాథ్ ను దర్శించుకున్నట్టు అధికారులు చెప్పారు.
ఇది ఇలా వుంటే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ శ్రీ నగర్‌లో ర్యాలీ నిర్వహించేందుకు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) నిర్ణయించింది. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆపార్టీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్భందం చేశారు. తమ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా పోలీస్ స్టేషన్లలో నిర్బందించినట్టు ఆమె ట్వీట్ చేశారు.
మరోవైపు తమ పార్టీ ప్రధాన కార్యాలయానికి సీలు వేశారని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఆరోపించింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదని పేర్కొంది. ఆగస్టు 5,2019న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించింది. దీంతో జమ్ము కశ్మీర్ కు వున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అయింది.