Amarnath Yatra: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజైన శనివారం అమర్నాథ్ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భక్తులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. యాత్ర శుభప్రదం కావాలని ఆకాంక్షించారు. కాగా, శుక్రవారం సాయంత్రం జమ్మూలోని భగవతి నగర్ నుంచి బాల్జాల్, సున్వాన్ బేస్ క్యాంపులకు 4,603 మంది యాత్రికులు చేరుకోవడం తెలిసిందే.
శనివారం ఉదయం వీరందరూ బేస్ క్యాంపుల నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఆలయాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. అనంత్నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్-పహల్గాం సంప్రదాయ మార్గం ఒకటి కాగా, గండేర్బాల్లోని ఇరుకైన 14 కిలోమీటర్ల బాల్జాల్ మార్గం మరోటి, ఈ రెండు మార్గాల గుండా సాగే యాత్రను సీనియర్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. శనివారం మధ్యాహ్నానికల్లా యాత్రికులు కాశ్మీర్ లోయకు చేరుకున్నారు. అక్కడ వీరికి అధికారులు, స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు.