NATTIKUMAR: ప్రముఖ నిర్మాత నట్టికుమార్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో బయటపెట్టాలని ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఓ వీడియో విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఆధారాలతో సహా అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది కదా.. మరి సీఎం చినాన్న వివేకాను ఎవరు చంపారో కనిపిఎట్టలేకపోయిన స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. జగన్, వైవీ సుబ్బారెడ్డి, రోజా, ది గ్రేట్ అంబటి రాంబాబు, సినిమా ఇండస్ట్రీ దేవుడు పోసాని కృష్ణమురళికి చిత్తశుద్ధి ఉంటే వివేకాను ఎవరు చంపారో బయటపెట్టండని ఛాలెంజ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబు అరెస్టును ప్రజలు నమ్మరన్నారు. వివేకా హత్య కేసు నిందితులను పట్టుకున్నప్పుడే చంద్రబాబు అరెస్టును ప్రజలు నమ్ముతారని నట్టికుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను నట్టికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీలో వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని పేర్కొన్నారు. దేవాలయం లాంటి శాసనసభలో మంత్రి కులాల ప్రస్తావన తీసుకురావడం, గొడవలకి వేదికగా చేసుకుని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ప్రజలకి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక సినీ ఇండస్ట్రీలో అందరికంటే ముందుగా చంద్రబాబు అరెస్టును నట్టికుమార్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ చంద్రబాబు ఏ రోజు కక్షసాధింపులు చేయలేదన్నారు.14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అలాంటి వ్యక్తి జైలులో ఉండకూడదని.. ఆయనపై పెట్టిన కేసులలో నిజాలు ఉన్నాయా? లేవా? అన్న అంశాలను కోర్టులు చూసుకుంటాయని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ స్పందించకపోడం బాధాకరమని నట్టి వాపోయారు.
ఇది కూడా చదవండి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు గాయాలు..!!