Again rain: మళ్లీ రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టనున్నాయి. ఏపీలో కోస్తాలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడమే అందుకు కారణం. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు.
అయితే బంగాళాఖాతంలో మయన్మార్, బంగ్లాదేశ్ మీదుగా మేఘావృతం అయిందని.. అది కాస్త ఈ రోజు తెలుగు రాష్ట్రాల వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, ఈ రోజు వాతావరణ శాఖ హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సిద్దిపేటతో పాటు నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
అయితే.. గత వారం రోజుల నుంచి హైదరాబాద్లో ఎండలు దంచుతుంటే..శనివారం నుంచి సడెన్ గా వెదర్ ఛేంజ్ అయింది. ఒక్కసారిగా నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. నగరం మొత్తం కారు మబ్బులు కమ్మి.. వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షం కూడా పడింది. భరత్ నగర్ ,మాదాపూర్ ,టోలిచౌకి , రాజేంద్ర నగర్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన పడింది. దీంతో పాటు పంజాగుట్ట, అమీర్ పేట్, షేక్ పేట్, ఉప్పల్ లలో కూడా చిరుజల్లు పడ్డాయి.