Cyclone Michaung Effect In AP: మిచైంగ్ తుఫాన్ ప్రభావం వల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గత రెండు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ అధికారి సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
అటు ప్రకాశం జిల్లాపై తుఫాన్ ప్రభావం భారీగానే ఉంది. దీంతో నేడు, రేపు స్కూల్స్ సెలవు ఇవ్వాలని సర్కార్ తెలిపింది. ఇక ఈ తుఫాన్ కారణంగా ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. అటు తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ నెడ్డి కూడా అధికారులను అలర్ట్ చేశారు. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: భయంకరంగా మైచౌంగ్ తుఫాన్…ఏపీలో దంచికొడుతున్న వానలు…!!
అటు నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా Cyclone Michaung కదులుతోంది. గంటకు 13కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా విస్తరించనుంది. రేపు మధ్యాహ్ననం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని…ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని డా. బి.ఆర్ అంబేద్కర్ , విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
అటు చిక్కోలు తీరంలో మిఛౌంగ్ వాయుగుండం సంకేతాలు కనిపిస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08942_240557. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్. చేపల వేటపై నిషేదాజ్ఞలు, పోలీస్, మెరైన్ పోలీస్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసింది. మైదాన ప్రాంతంలో వరి పంటకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.