Russia Jobs: ఏజెంట్ల డబ్బుల దాహం.. రష్యా యుద్ధోన్మాదం.. బలి అవుతున్న మన యువతరం! రష్యాలో ఉద్యోగం.. లక్షల జీతం అని ఏజెంట్స్ చెబితే నమ్మకండి. ఇప్పటికే చాలామంది ఇలా రష్యాలో ఉద్యోగం అని వెళ్లి..అక్కడ యుద్ధంలో సైనికులకు సహాయకులుగా పనిచేస్తూ తమ జీవితాలు కోల్పోయారు. ఇప్పుడు వారి కుటుంబాలు కన్నీరు..మున్నీరు అవుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ కథనం చదవండి By KVD Varma 07 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Russia Jobs: తినడానికి తిండి లేక.. జీవితంలో కష్టాలు దూరం అవ్వాలంటే కష్టమైనా ఎదో ఒక పని చేయాలని.. డబ్బు సంపాదించి తమ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనీ ఆరాటపడే యువత మన దేశంలో చాలా మంది ఉన్నారు. మన దేశంలో వచ్చే డబ్బు ఒక్కరి పొట్ట నింపడానికే చాలని పరిస్థితుల్లో విదేశాల్లో కూలి పని చేసినా డబ్బు దండిగా వస్తుందనే ఆశతో..ప్రయత్నాలు చేసేవారిని టార్గెట్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. విదేశాలకు పంపిస్తామంటూ ప్రచారం చేసి.. వారి వద్ద నుంచి డబ్బు గుంజి ఆనక ఎదో ఒక వంక చెప్పి మొహం చాటేసే సంస్థలు చాలానే ఉన్నాయి. అలానే.. డబ్బు తీసుకుని విదేశాలకు దొంగ వీసాల మీద పంపించి అక్కడ మీ చావు చావండి అని చెప్పి చేతులు దులిపేసుకునే సంస్థల గురించి వార్తలు చాల వింటూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తరకం దందా మొదలైంది. ఈ దందా రష్యా-ఉక్రెయిన్ (Russia Jobs)యుద్ధం కోసం మొదలు పెట్టారు. అవును.. రష్యాలో ఉద్యోగం.. మంచి జీతం అని చెప్పి యువకులను మభ్యపెట్టి.. ఉక్రెయిన్ తో యుద్ధం కోసం రష్యా ప్రయివేట్ ఆర్మీలో చేర్పించేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది. గత నెలలో.. గత నెలలో 9 మంది భారత పౌరులు రష్యా యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నారనీ.. వారిలో ఇద్దరు తెలంగాణ యువకులు ఉన్నారనీ తెలిసాక ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. మృతుల కుటుంబాలు తమ పిల్లలు ఉద్యోగం కోసం రష్యా(Russia Jobs) వెళ్లారని చెబుతూ.. అక్కడ ఇలా యుద్ధం చేసే ఉద్యోగం చేస్తుండడం ఏమిటంటూ విలవిలలాడిపోయారు. ఏజెంట్స్ రష్యాలో ఉద్యోగం జీతం బాగా వస్తుంది అని చెప్పి డబ్బు తీసుకుని మరీ రష్యా పంపించారని వారు వాపోయారు. ఇటు అప్పూ సోప్పూ చేసి కట్టిన డబ్బూ పోయి.. అటు కుటుంబానికి ఆసరా కావాలని దేశం కానీ దేశం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయిన తమ వారిని తలచుకుంటూ కుమిలిపోయారు. తాజాగా తెలంగాణ యువకుడు.. ఈ విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఈలోగా మరో యువకుడు రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ క్లాత్ షోరూమ్‌లో పనిచేసే అస్ఫాన్ దుబాయ్ కి చెందిన ఒక ఏజెంట్ మాటలు నమ్మి.. డబ్బులు కట్టి రష్యా(Russia Jobs) ఉద్యోగం కోసమని వెళ్ళాడు. అక్కడకు చేరుకున్న తర్వాత, మహ్మద్ అస్ఫాన్, మరో ఇద్దరితో రష్యన్ భాషలో ఉన్న ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేయించుకున్నారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం రష్యా సైన్యంలో హెల్పర్‌గా రిక్రూట్‌మెంట్ చేసుకుంది పుతిన్ ప్రభుత్వం. ఈ విషయం అస్ఫాన్‌కు చాలా ఆలస్యంగా అర్థమైంది. తనకు ఆయుధాలు వాడేందుకు శిక్షణ ఇస్తున్నట్లు తన సోదరునికి ఫోన్ చేసి చెప్పాడు అస్ఫాన్. ఏజెంట్లు ఇదంతా ట్రైనింగ్ అని చెప్పారని చెప్పాడు. కొన్నిరోజుల తరువాత అస్పాన్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో రష్యా(Russia Jobs)లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు అస్పాన్ కుటుంబసభ్యులు. అప్పుడు రష్యా యుద్ధంలో అస్పాన్ చనిపోయాడని తెల్సింది. యూట్యూబ్ వీడియోలతో.. ఇప్పుడు అస్పాన్ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. అసలు ఇలా ఎలా జరుగుతోంది? దీనికి ఒక్కటే కారణం కనిపిస్తోంది. రష్యా యద్ధం(Russia Jobs)లో పాల్గొనడానికి సిబ్బంది కావాలి. అందుకోసం రష్యా ప్రభుత్వం ప్రయివేట్ సైన్యాన్ని వినియోగిస్తోంది. ఆ ప్రయివేట్ సైన్యం కొందరు ఏజెంట్స్ ని రంగంలోకి దించింది. అలాంటి వారిలో బాబా వ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న దుబాయ్ కి చెందిన ఒక వ్యక్తి ఒకడు. అతను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రష్యాలో ఉద్యోగాలు అంటూ వీడియోలు చేస్తూ.. ఆ వీడియోలు చూసి ఆకర్షితులైన వారికి మాయమాటలు చెప్పి.. డబ్బు తీసుకుని రష్యా చేరవేస్తున్నాడు. ఇటు రిక్రూట్ చేసుకున్నవారు దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలవరకూ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అటు రష్యా ప్రయివేట్ ఆర్మ్ రిక్రూటర్ల దగ్గర నుంచి కూడా కమిషన్ ఇతనికి ముడుతోందని జాతీయ మీడియా వెల్లడించింది. యుద్ధంలో మరణించిన వారి వివరాలే ఇప్పటివరకూ బయటకు వచ్చాయి. ఇంకా భారత్ నుంచి అర్ఫాన్ లాంటి ఎంతమంది యువకులు ఇలా ఏజెంట్ల మాయలో పడిపోయారో తేలాల్సివుంది. Also Read: రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో చనిపోయిన హైదరాబాదీ మహ్మద్ అస్ఫాన్ ఎవరు? విదేశాల్లో ఉద్యోగాలు ఊరికే రావు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏజెంట్ల ద్వారా రష్యా(Russia Jobs)లాంటి ఉద్రిక్త ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్లాలనే ఆలోచన యువత మానుకోవాలి. ఏజెంట్లు తమ పబ్బం గడుపుకోవడం కోసం మన దేశ యువతకు ఎర వేస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని.. అబద్ధపు వీడియోలతో యువతను ఆకర్షిస్తున్నారు. దీంతో ఎదో మంచి జీవితం దొరుకుతుంది.. రెండు మూడేళ్లు కష్టపడితే కుటుంబం అంతా సుఖపడుతుంది అనుకుని అప్పులు చేసి ఏజెంట్లకు డబ్బులు కట్టి రష్యాలాంటి దేశాలు చేరి.. అక్కడ తమది కానీ దేశంలో యుద్ధ తంత్రానికి బలైపోతున్నారు. ఎప్పుడూ విదేశాల్లో ఉద్యోగం అని చెప్పే ఏజెంట్ల మాటలు నమ్మవద్దు. ఏ దేశమూ తమ దేశంలో ఉద్యోగాల కోసం ఏజెంట్ల ద్వారా ప్రయత్నాలు చేయదు. ఎవరైనా ఏజెంట్ ఇటువంటి మాటలు చెబితే, ఆ దేశానికి సంబంధించిన ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడ మీరు ఏజెంట్ చెప్పిన ఉద్యోగానికి సంబంధించిన వివరాలను చెబితే, దానిలో నిజం ఎంతనేది తేలిపోతుంది. అంతేకాదు, సమీపంలోని పోలీస్ స్టేషన్ లో కూడా సమాచారం ఇవ్వండి. దీనివలన పోలీసులు సదరు ఏజెంట్ పై నిఘా ఉంచుతారు. ఇష్టం వచ్చినట్టు ఇక్కడి యువతను అలా పెడదారుల్లో యుద్ధ భూముల్లో ప్రాణాలు కోల్పోయేలా చేయకుండా కట్టడి చేస్తారు. ముందుగానే, వారు చర్యలు తీసుకునే వీలుంటుంది. గుర్తుంచుకోండి విదేశాలలో ఉద్యోగాలు అంత ఈజీగా డబ్బులు కడితే రావు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏ ప్రాసెస్ లేకుండా.. డబ్బులు కడితే దేశాలు దాటిపోవచ్చు.. అక్కడ ఉద్యోగాలు.. ఉపాధి పొందవచ్చు అనుకుంటే మీరు కూడా యుద్ధోన్మాదానికే బాలి అవుతారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతున్న ఏజెంట్ వీడియో ఇక్కడ చూడండి: #jobs #russia-ukraine-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి