Boat Accident: తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓ నదిని దాటుతుండగా పడవ బోల్తా పడిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు చనిపోయారు. ఈ ప్రమాదం గురించి స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ.. మహ్మంద్ దారా జిల్లాలో నదిని దాటుతుండగా బోటు బోల్తా పడిందని..దీంతో బోటులో ఉన్న వారంతా కూడా మునిగిపోయారని నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు.
మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. బోటులో 25 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కేవలం ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని గ్రామస్తులు పేర్కొన్నారు. వారంతా కూడా ఈత రావడంతో ఎలాగో నీటిలోంచి ఈదుకుంటూ బయటపడ్డారు. మృతుల్లో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
నంగర్హార్ ఆరోగ్య శాఖ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఓ పురుషుడు, ఓ మహిళ, ఇద్దరు యువకులు,ఓ యువతి తో సహా ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సహాయక సిబ్బంది మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనపై అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు.
Also read: నేడే మహబూబ్ నగర్ ఎమ్మల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు..