ఇండిగో ఫ్లైట్ ఏసీలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ట్వీట్ చేశారు. ఇండిగో ఫ్లైట్ చండీఘడ్ నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ పరిస్థితి ఎదురైనట్లు చెప్పారు. విమానంలోకి వెళ్లేందుకు పది నుంచి పదిహేను నిమిషాలపాటు ఎండలో క్యూలో నిలబడాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఏసీ ఆన్ లో లేకపోయినా విమానం టేకాఫ్ అయ్యిందని వివరించారు. ఎయిర్ కండీషనర్లు పనిచేయడం లేదని వారింగ్ చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విమానయాన సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలను ఆయన కోరారు.
ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంత వరకూ ప్రయణికులందరూ ఏసీ లేక తీవ్ర ఇబ్బంది పడ్డాం. ఇంత పెద్ద సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. చెమటలు తుడుచుకునేందుకు ఎయిర్ హోస్టెస్ బోలెడు టిష్యూ పేపర్లు ఇచ్చింది. ప్రయాణికులు తమ దగ్గర ఉన్న పేపర్లు విసురుకున్నారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. డీజీసీఏ, ఏఏఐలను కూడా తన ట్విట్ కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రయాణీకుల ఫిర్యాదుల కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్ వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. 2018లో ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో ఏసీ సరిగా పనిచేయకపోవడంతో ఊపిరి ఆడలేదంటూ ఫిర్యాదు చేశాడు.