శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయంలో (Mallikharjuna Swami Temple) అభిషేకాలకు సంబంధించి ఆలయాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారికి జరిగే ఆర్జిత అభిషేకాలు (Arjitha Abhishekalu) మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నుంచి సోమవారం వరకు వీటిని రద్దు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
డిసెంబర్ 23 శనివారం ముక్కోటి ఏకాదశి (Mukkoti Ekadasi) కావడంతో పాటు ఆదివారం కూడా రావడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని శనివారం , ఆదివారం , సోమవారం (క్రిస్టమస్ సెలవు) నాడు స్వామి వారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మూడు రోజుల పాటు వరుస సెలవులు కావడంతో ఆలయాధికారులు ముందుస్తుగా గర్భాలయ, సామూహిక అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అభిషేకాలను రద్దు చేయడంతో దానికి ప్రత్యామ్నాయంగా రోజుకు నాలుగు విడతల్లో స్వామి వారి సర్వ దర్శనానికి ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
రేపటి నుంచే సర్వ దర్శనానికి నాలుగు విడతలుగా అనమతించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన టికెట్లను దేవస్థానం వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని దేవస్థానం అధికారులు భక్తులకు సూచించారు. శనివారం నాడు స్వామి వారి మహాక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఘనంగా ఏర్పాటు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం, రావణ వాహన సేవ నిర్వహిస్తున్నామని ఆలయాధికారులు వివరించారు. అనంతరం ఆలయంలో ఉత్సవమూర్తులకు పూజలు చేసిన తరువాత స్వామి వారి ఆలయ ముఖ మండప ఉత్తర ద్వారం ద్వారా తీసుకొచ్చి గ్రామోత్సవం ప్రారంభించిన తరువాత ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతినిస్తామని ఆలయాధికారులు వివరించారు.
Also read: చంద్రబాబు ఇంట్లో మూడు రోజుల పాటు ప్రత్యేక యాగాలు..అధికారమే లక్ష్యమా?