Delhi Ordinance Bill : విపక్షాల గందరగోళం మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill)కు ఆమోదం తెలిపింది లోకసభ. గురువారం సాయంత్రం మూజువాణి ఓటు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయడంతో పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు విపక్షాలు కూడా బిల్లుపై చర్చల్లో పాల్గొని.. అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. విపక్షాల అభ్యంతరాలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. మూజువాణి ఓటు జరిగింది. విపక్షాల ఆందోళన నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లకు ఆమోదం లభించింది. ఆప్ ఎంపీ రింకూ సింగ్ పేపర్‌ను చించి స్పీకర్ కుర్చీ వైపు విసిరారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సుశీల్ కుమార్ రింకూ చైర్‌ను అవమానించినందున సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు. శుక్రవారం రాజ్యసభ ముందుకు బిల్లు చర్చకు రానుంది.
లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill)ఆమోదంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 'ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని బీజేపీ ప్రతిసారీ హామీ ఇచ్చింది. 2014లో తాను ప్రధాని అయితే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తానని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారు. "కానీ ఈరోజు ఈ వ్యక్తులు ఢిల్లీ ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఇకమీదట ప్రధాని మోదీని ఎవరూ నమ్మవద్దు" అంటూ ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి మే 19న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇది ఢిల్లీలోని గ్రూప్ ఎ అధికారుల బదిలీ పోస్టింగ్ క్రమశిక్షణా చర్యలకు సంబంధించినది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారు. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం శాంతిభద్రతలు, పోలీసు, భూమి వ్యవహారాలు మినహా ఇతర సేవలపై నియంత్రణను కలిగి ఉంటుంది. అయితే ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకించింది.
అమిత్ షా కీలక వ్యాఖ్యలు:
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాలన్నారు. గతంలో జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లాభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్ వంటి నేతలు కూడా ఢిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించినట్లు తెలిపారు. మీ కూటమిలో ఉన్నారన్న కారణంతో ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు ఇవ్వద్దంటూ అన్ని పార్టీలను కోరుతున్నాను అని అన్నారు. ఏ కూటమి ఉన్నప్పటికీ రాబోయేది మోదీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.
కాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు ఎవరి నియంత్రణలో ఉండాలన్న అంశంపై గత కొన్నాళ్లుగా కేంద్రం వర్సెస్ ఆప్ మధ్య వాగ్వాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.