Moon: చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తాజాగా వారి ప్రయత్నాలకు మరింత ఆసరా ఇచ్చేలా జాబిల్లిపై ఒక గుహ ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇలాంటివి అక్కడ వందల సంఖ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇటాలియన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చంద్రునిపై గుహ ఉన్నట్లు, దాని పరిమాణం పెద్దగానే ఉండొచ్చనడానికి ఆధారాలు ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ గుహ చందమామ పై ఎక్కడ ఉందనే విషయాన్నికూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. 1
1969లో అంటే.. 55 సంవత్సరాల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ల్యాండ్ అయిన ‘సీ ఆఫ్ ట్రాంక్విలిటీ’ ప్రదేశానికి 400 కిలో మీటర్ల దూరంలో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక లావా సొరంగం కుప్పకూలడం వల్ల ఈ గుహ ఏర్పడి ఉండొచ్చని, బాబిల్లిపై అత్యంత లోతైన బిలం నుంచి ఇందులోకి ప్రవేశమార్గం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ అందించిన రాడార్ కొలతలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. ఆ వివరాలను భూమి మీదున్న లావా సొరంగాలతో పోల్చారు. నేలమాళిగలోని ఒక గుహకు సంబంధించిన కొంత సమాచారాన్ని ఈ రాడార్ డేటా వెల్లడించింది. ఆ కృతి వెడల్పు 130 అడుగులు, పొడవు పదుల మీటర్లలో ఉండొచ్చని అంచనా.
చంద్రుడిపై పునాదుల నుంచి ఆవాసాన్ని నిర్మించడానికి ఈ గుహ ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతేకాక.. చంద్రుడి ఆవిర్భావం గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.చంద్రునిపై శాశ్వత మానవ నివాసాలను ఏర్పాటు చేయడానికి పలు దేశాలు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రుడిపై రేడియోధార్మికత, విపరీతమైన ఉష్ణోగ్రతలు, అంతరిక్ష వాతావరణం నుంచి వ్యోమగాములను రక్షించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం శాస్త్రవేత్తలు నిర్ధారించిన గుహలు వ్యోమగాములకు సహజసిద్ధ షెల్టర్లుగా పనికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశ్వం నుంచి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాలు, సౌర రేడియోధార్మికత, చిన్నపాటి ఉల్కల నుంచి ఇవి వ్యోమగాములకు రక్షణ కల్పిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Also read: గురుకుల పాఠశాలలో విషాదం..ఐదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి!