/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-16-2-jpg.webp)
వచ్చే సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగకు సుమారు నెలన్నర రోజుల ముందే వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. కొన్ని రైళ్లకు రిగ్రెట్ అని వస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి నగరంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు వేల సంఖ్యలో ఉంటారు. వారిలో చాలా మంది సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకుంటారు. దీంతో ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 14,15,16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండగలు ఉన్నాయి. దీంతో జనవరి 11, 12, 13 తేదీల్లో నడిచే రైళ్లు ఇప్పటికే నిండిపోయాయి. చాలా మంది ప్రయాణ సమయానికి కన్ఫర్మ్ అవుతుందన్న ఆశతో బుక్ చేసుకుంటున్నారు.
కాగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే జన్మభూమి, గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు, ఈస్ట్ కోస్ట్, విశాఖ వందేభారత్, ఫలక్ నుమా, విశాఖ ఎక్స్ ప్రెస్, గరీబ్ రథ్ తోపాటు చెన్నై, ముంబై, బెంగళూరు నుంచి ఒడిశావైపు వెళ్ల రైళ్లకు డిమాండ్ ఎక్కువుంది. పండగ రద్దీ కావడంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసే అవసరం ఎంతైనా ఉంది. ప్రతిఏటా అదనంగా కొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ వాటిలో సౌకర్యాల లేమితో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ..తొలి ఫలితం ఎక్కడినుంచంటే..?