200 పరుగుల లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఆరంభంలో తడబడింది. శిఖర్ ధావన్ (1), సామ్ కర్రన్ (5) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కాగా.. దూకుడుగా ఆట మొదలుపెట్టిన జానీ బెయిర్‌స్టో (13 బంతుల్లో 22), గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ప్రభుసిమ్రాన్ సింగ్ (24 బంతుల్లో 35) కూడా పెవిలియన్ చేరడంతో.. పంజాబ్ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. శశాంక్ సింగ్ దూకుడుగా ఆడాడు. గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడుతూ రన్ రేట్ పడిపోకుండా చూశాడు. కానీ మరో ఎండ్‌లో సికందర్ రజా, జితేశ్ శర్మ సైతం త్వరగానే ఔట్ కావడంతో.. పంజాబ్ 15.3 ఓవర్లలో 150 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ ఇంపాక్ట్ చూపించాడు. చివరి ఓవర్లో అశుతోష్ ఔటైనా.. శశాంక్ సింగ్ లాంఛనాన్ని ముగించాడు.
Also Read: పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చే షాహీన్ అఫ్రిది
ఐపీఎల్ 2024 (IPL) వేలంలో శశాంక్ సింగ్ పేరుతో ఉన్న మరో ప్లేయర్‌ను కొనుగోలు చేయబోయి పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసింది. రూ.20 లక్షల ప్రాథమిక ధరకే అతణ్ని సొంతం చేసుకుంది. అయితే తాము పొరబాటున వేరే ఆటగాణ్ని కొనుగోలు చేశామని గ్రహించిన పంజాబ్ కింగ్స్ నాలుక కరుచుకుంది. అయితే ఐపీఎల్ వేలం నిబంధనల ప్రకారం వేలంలో ఓసారి ఆటగాణ్ని కొనుగోలు చేశాక.. అతణ్ని వద్దని చెప్పడం కుదరదు. దీంతో పంజాబ్ కింగ్స్ సైలెంట్ అయిపోయింది.పంజాబ్ కింగ్స్ ఆ తర్వాత ఇచ్చిన వివరణలో.. ‘లేదు లేదు మేం కొనుగోలు చేయాలని అనుకుంది ఇతణ్నే’ అని స్పష్టం చేసింది. ‘శశాంక్ సింగ్ మా టార్గెట్ లిస్టులోనే ఉన్నాడు. కానీ అదే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో గందరగోళం నెలకొంది. అతణ్ని కొనుగోలు చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ’ పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.
శశాంక్ సింగ్ (Shashank Singh) గతంలో సన్‌రైజర్స్ జట్టుతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీల్లోనూ భాగంగా ఉన్నాడు. ఈ 32 ఏళ్ల అన్క్యాప్డ్ ప్లేయర్ 2011లో పుణే వారియర్స్ జట్టులోనూ భాగంగా ఉన్నాడు. ఇన్ని ఫ్రాంచైజీలు మారినా.. అతడికి మాత్రం పెద్దగా ఆడే అవకాశం రాలేదు. ఇప్పటి దాకా 14 ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన శశాంక్.. 9 మ్యాచ్‌ల్లోనే బ్యాటింగ్‌కు దిగాడు. శశాంక్ సింగ్ సన్‌రైజర్స్‌లో ఉన్న సమయంలో బ్రియాన్ లారాక అతడి ఆట తీరు బాగా నచ్చింది. శశాంక్ ఛత్తీస్‌గఢ్ తరఫున లిస్ట్ ఏ క్రికెట్ ఆడుతున్నాడు.