Mid Day Meals: ప్రభుత్వం పిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న సమయంలో భోజనం ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనంలో గుడ్డు కూడా ఇస్తారు. అలాగే కర్ణాటకలోని శివమొగ్గలో కూడా ఎప్పటిలానే మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్లు పిల్లందరికీ ఇచ్చారు. దాని తరువాత మర్నాడు ఉదయం మొదలైంది రచ్చ. తన కుమార్తెకు బలవంతంగా కోడిగుడ్డు తినిపించారు అంటూ ఒక తండ్రి పాఠశాల ఉపాధ్యాయులపై కంప్లైంట్ చేశాడు. దీంతో ఆ ఉపాధ్యాయులకు పెద్ద చిక్కే వచ్చింది.
తాము కఠినమైన శాఖాహారులం అనీ.. ఎట్టి పరిస్థితిలోనూ తమ బిడ్డకు కోడిగుడ్డు ఇవ్వొద్దని స్కూల్ లో చేర్చినపుడే ఉపాధ్యాయులకు చెప్పామని ఆ తండ్రి అధికారులకు చెప్పాడు. ఇలా చెప్పినప్పటికీ, తన కుమార్తెకు మధ్యాహ్న భోజన సమయం(Mid Day Meals)లో బలవంతంగా కోడిగుడ్డు తినిపించారనీ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ కోరుతూ ఆ తండ్రి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసాడు. దీంతో విద్యాశాఖ అధికారులు ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు.
Also Read: రెండు గంటల్లో 29 మందిని కరిచిన కుక్క.. స్థానికులు ఏం చేశారంటే..
అయితే, తాము మధ్యాహ్న భోజన సమయంలో పిల్లందరినీ గుడ్డు తినేవాళ్లు చేతులు ఎత్తాలని కోరామని.. ఆ చిన్నారి కూడా చేతులు ఎత్తడంతో కోడిగుడ్డు ఇచ్చామని స్కూలు టీచర్స్ చెబుతున్నారు. ప్రత్యేకంగా ఈ పాపతోనో లేదా ఇతర విద్యార్ధులతోనో కోడిగుడ్డు తినమని బలవంతం చేయడం జరగలేదని అన్నారు. అసలు ఆ విధంగా చేసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఆ వ్యక్తి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వారు అంటున్నారు. ప్రాధమిక పరిశీలనలో ఇదే విషయం తేలిందని స్కూల్ సీనియర్ ఒకరు చెప్పారు. అయితే, ఈ ఘటనపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో విచారణకు విద్యాశాఖ ఆదేశించింది.
ఇప్పడు ఈ విషయం విచారణలో ఉంది. ఇక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని శివమొగ్గ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ పరమేశ్వరప్ప అన్నారు. అయితే, తమకు అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఇలా ఆ చిన్నారికి బలవంతంగా గుడ్డు ఇవ్వలేదని చెప్పారు. అయినా.. విచారణ జరుగుతోందని, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇచ్చే రిపోర్ట్ తరువాత.. ఏదైనా ఉల్లంఘన జరిగినట్టు తెలిస్తే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మొత్తమ్మీద ఒక కోడి గుడ్డు ఆ స్కూల్ లో టీచర్లకు టెన్షన్ తీసుకువచ్చింది అని అక్కడి స్థానికులు అనుకుంటున్నారు.
Watch this interesting Video: