Bengaluru: బెంగళూరు నగరం తీవ్ర నీటి కొరతతో అల్లాడిపోతోంది. ఎండా కాలం మొదలుకాకముందే జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. నీరు వృథా చేస్తే భారీగా జరిమానా విధించాలని నిర్ణయించింది. అంతేకాదు నీటిని వృథా చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం విశేషం.
వృథా చేసే వారికి రూ.5 జరిమాన..
ఈ మేరకు బెంగళూరు నగరంలోని యలహంక, కనకపుర, వైట్‌ఫీల్ట్ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో నీరు వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ వినూత్న ఆలోచన చేసింది. ఆ హౌసింగ్ సొసైటీలో ఉన్న వారు ఎవరైనా నీటిని అతిగా ఉపయోగించడం, వృథా చేసే వారికి రూ.5 జరిమాన విధిస్తామని తెలిపింది. ఇక ఈ నీటి వృథాను పర్యవేక్షించడానికి స్పెషల్‌గా సెక్యూరిటీని నియమించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ.. ఆ సొసైటీలో నివసించే వారికి నోటీసులు జారీ చేసింది. అలాగే బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్ బోర్డు నుంచి గత 4 రోజులుగా నీరు రావడం లేదని పామ్ మిడోస్ హౌసింగ్ సొసైటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం బోర్ల ద్వారా అక్కడి వారికి నీరు అందిస్తున్నామని, హౌసింగ్ సొసైటీలో నివసించేవారు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని సూచించినట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: TS EDCET: టీఎస్ ఎడ్‌సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్!
రూ.556 కోట్లు మంజూరు..
నీటి కొరతపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. బెంగళూరులో నీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. బెంగళూరు నగరంలోని ప్రజల నీటి అవసరాల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఇక ప్రజల అవసరాలకు సరిపడా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడంతో ఖాళీ పాల ట్యాంకుల్లో నీటిని నిల్వ చేసి.. ప్రజలకు సరఫరా చేసేందుకు ఉపయోగిస్తామని ఆయన వెల్లడించారు.