కర్ణాటక రాష్ట్రంలోని చన్నగిరి తాలూకాలోని పెట్రోలు పంపు సమీపంలోని రోడ్డు పై ఓ వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు పోలీస్ డాగ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్నారు. అనంతరం చనిపోయిన వ్యక్తి చొక్కా వాసిన పసిగట్టిన పోలీస్ డాగ్ చన్నాపురం వైపు దూసుకెళ్లింది.
మృతదేహమున్న ప్రాంతం నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్లు పోలీస్ డాగ్ ఆగకుండా పరిగెత్తింది. చన్నాపురం సమీపంలో ఓ ఇంటి నుంచి పెద్ద శబ్ధం వచ్చింది. ఇది విన్న పోలీసు కుక్క వెంటనే అక్కడ ఆగింది. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగా, ఓ వ్యక్తి ఓ మహిళను దారుణంగా కొట్టడం కనిపించింది. దీంతో అతనిని పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశారు. ఆసక్తికర విషయమేమిటంటే పోలీసు అరెస్ట్ చేసిన వ్యక్తి, హత్యకు గురైన వ్యక్తి కేసులో నిందితుడు ఒకడే కావటం.
రోడ్డు పక్కన దొరికిన మృతదేహం సందెపెన్నూరుకు చెందిన సంతోష్ దిగా పోలీసులు గుర్తించారు. సంతోష్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన రంగస్వామి పెట్రోల్ బంకు సమీపంలోని అంతర్గత రహదారిపై కొడవలితో నరికి చంపాడు. హత్య జరిగిన ప్రదేశంలో రంగస్వామి వాసన పసిగట్టిన పోలీసు కుక్క అతని ఇంటి వైపు పరుగెత్తింది.సంతోష్‌ను హత్య చేసిన రంగస్వామి .. తన భార్య రూపను కూడా చంపాలని నిర్ణయించుకుని చన్నాపురం అనే గ్రామానికి వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అద్భుతంగా పనిచేసిన డాగ్ స్క్వాడ్‌లను అందరూ అభినందించారు.