నిర్మల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఊహించని ప్రమాదం జరిగింది. ముక్కుపచ్చలారని పసిపాపను అల్పాహారం బలితీసుకుంది. అప్పటిదాకా తోటి స్నేహితులతో ఆడుతూ పాడుతూ గడిపిన ఆరేళ్ల చిన్నారి ఆనంతలోకాలకు వెళ్లిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప అనుకోకుండా ఇలా మృత్యువాత పడగటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఈ దారుణం స్కూల్ యాజమాన్యంతోపాటు స్థానిక ప్రజలను కలిచివేస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్‌లో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. కొరటికల్‌కు చెందిన కొండ్ర అశోక్-శిరీషల కూతురు కొండ్ర ప్రజ్ఞ(6) స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుంది. ప్రతిరోజులాగే ప్రజ్ఞ స్కూల్ వెళ్లింది. అయితే విద్యార్థులకు అల్పాహారం అందించే క్రమంలో ఉదయం 11:30 గంటలకు ముత్తవ్వ, లావణ్య, రాజమణి, లక్ష్మీలు రాగిజావను సిద్ధం చేశారు. అప్పుడే వండిన వేడి రాగిజావను పెద్ద పాత్రలో నుంచి బకెట్లలో పోస్తున్నారు. అయితే అక్కడే లైన్‌లో నిలబడిన ప్రజ్ఞ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ రాగిజావ పాత్రలో పడిపోయింది. దీంతో ఒక్కసారిగా బాలిక అరుపు అందుకోగా అప్రమత్తమైన వారంతా సెకన్లలోనే ఆమెకు బటయకు తీశారు. కానీ ఆ లేత శరీరానికి అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. చేతులు, కాళ్లు, నడుము ప్రాంతాల్లో మాంసం ఊడొచ్చేలా కాలిపోయింది. అయితే స్కూల్ టీచర్స్ సుధాకర్, శ్రీనివాస్, పద్మ, కుటుంబ సభ్యులతో కలిసి ప్రజ్ఞను నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ శనివారం రాత్రి 10 గంటలకు మరణించింది.
ఇది కూడా చదవండి : తార్నాకలో దారుణం.. బస్సు కోసం వేచివున్న మహిళను యువకులు ఏ చేశారంటే
ఈ సంఘటనపై తహసీల్దార్ సర్ఫరాజ్ వెంటనే విచారణ చేపట్టారు. విద్యార్థులు అల్పాహారం తీసుకునే సమయంలో ఉపాధ్యాయులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో కలెక్టర్ ఆదేశాలతో డీఈవో రవీందర్‌రెడ్డి, పాఠశాల ఇన్‌చార్జి హెడ్ మాస్టర్ రమను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్న భోజనం వండే పనివాళ్లను వెంటనే విధులనుంచి తీసేశారు. మృతురాలి తల్లి కొండ్ర శిరీష ఈ గ్రామానికి ఉపసర్పంచ్‌గా ఉన్నారు. చిన్నారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.