మన ఆరోగ్యానికి మేలు చేసే సీజనల్ ఫ్రూట్స్‌లో యాపిల్ కూడా ఒకటి. ఎన్నో పోషక విలవలు కలిగివుండే ఈ పండు మనల్ని ఎక్కువ కాలం హెల్తీగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అలాగే రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడంతోపాటు ముఖ్యంగా శరీరానికి కావాల్సిన చక్కెర స్థాయిలను సమపాళ్లలో అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకే ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదంటారు నిపుణులు.
అయితే మార్కెట్‌లో మనకు పలు రకాల యాపిల్స్ లభిస్తుండగా ఒక్కో యాపిల్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా భారత దేశంలోని హిమాలయ పర్వత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్‌లో పండించే 6 రకాల యాపిల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ యాపిల్స్‌లో విటమిన్లు, ఫైబర్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
కశ్మీర్ యాపిల్
కశ్మీర్ లోయ ప్రాంతంలో లభించే ఈ యాపిల్స్ చాలా తియ్యగా ఉంటాయి. ఇతర రకాలతో పోలిస్తే లేత ఎరుపు రంగులో ఉండే ఇందులో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఊపిరితిత్తుల పనితీరును చాలా మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం, వెంట్రుకలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
Also read :Health Benefits: చలికాలంలో పెరుగు తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..!!
కిన్నౌర్ యాపిల్
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో దాదాపు 7 వేల అడుగుల ఎత్తువరకు వీటిని రైతులు సాగుచేస్తారు. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లలో విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. చూడగానే నోరూరించే ఈ యాపిల్స్ తింటే కరకరలాడుతుంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థను అద్భుతంగా మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. బరువు తగ్గడానికి, నోటి ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
సిమ్లా యాపిల్
ఈ రకమైన యాపిల్స్ రంగు చూడగానే మనల్ని ఆకట్టుకుంటుంది. హిమాచల్ హిమాలయ పర్వత సానువుల్లో 6 వేల అడుగుల ఎత్తున ఈ చెట్లు పెరుగుతాయి. సిమ్లా యాపిల్‌లో విటమిన్లు ముఖ్యంగా విటమిన్-సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జలుబు, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. సిమ్లా యాపిల్‌ను ప్రత్యేకంగా తేనెతో కలుపుకుని తింటే ఆ మజానే వేరు.
రాయల్ గాలా యాపిల్
కశ్మీర్‌లోనే లభించే ఈ పండ్లు ఎరుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. కొరకగానే నోట్లో రసాలూరిస్తూ తియ్యటి రసాలను అందిస్తాయి. ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. రక్తపోటును కంట్రోల్ చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి. భోజనం తర్వాత ఇవి తింటే సులభంగా జీర్ణం అవుతుంది.
గోల్డెన్ డెలీషస్ యాపిల్
కశ్మీర్ పరిసర పాంతాల్లో పండించే ఈ పండ్లు బంగారు పసుపు రంగులో ఉంటాయి. చూడగానే అట్రాక్ట్ చేసే వీటి రుచి తియ్యగా ఉంటుంది. వీటిలో మంచి పోషకాలు ఉంటాయి. శరీరంలో సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని అందిస్తాయి. జీవక్రియలకు తగిన శక్తిని ప్రసాదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. శరీరంలో కలుషిత పదార్థాలను బయటికి (డిటాక్సిఫై) పంపుతాయి.
ఇండియన్ గ్రానీ యాపిల్
హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ రాష్ర్టాల్లో వీటిని దాదాపు ఏడు వేల అడుగుల ఎత్తువరకు సాగుచేస్తారు. ఆకుపచ్చ రంగులో కరకుగా, రస భరితంగా ఉండే ఇండియన్ గ్రానీ యాపిల్స్ కాస్త పులుపే. విటమిన్-సి, ఫైబర్, పొటాషియం, ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గుండెపోటు, పక్షవాతం ముప్పును తగ్గిస్తాయి. కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.