ఇండియాలో క్రికెట్(Cricket) ఆడని గల్లీ ఉండదు. ఒకవేళ గల్లీలో ప్లేస్ లేకపోతే ఏ గ్రౌండ్‌కు వెళ్లో ఆడుకుంటారు. అయితే గ్రౌండ్‌లో చాలా రద్దీ ఉంటుంది. ఆడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో పక్కపక్కనే పిచ్‌లు వెలుస్తాయి. ఫీల్డింగ్ చేసేవారికి ఇది చాలా తలనొప్పిగా ఉంటుంది. ఏ బాల్ ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. కొన్నిసార్లు వేరే బ్యాచ్ వారి బంతులను ఆపేస్తారు. మరికొన్నిసార్లు అవతలి పిచ్ వాళ్ల బాల్ వచ్చి తగులుతుంటుంది. గ్రౌండ్‌కి వెళ్లి ఆడే వారికి ఈ విషయాలు తెలియనవి కావు. ఇక క్రికెట్‌కు కేరాఫ్‌గా నిలిచే ముంబైలో ఆదివారం వచ్చిందంటే చాలు గ్రౌండ్స్ కిక్కిరిసిపోతాయి. ఎంతో ఉత్సాహంగా ప్లేయర్లు పరుగులు తీస్తారు.. బౌండరీలు బాదుతారు. కొన్నిసార్లు గాయపడతారు. అయితే మునుపెన్నడూ చూడని విధంగా అవతలి పిచ్‌పై ఆడుతున్న వారి బంతి తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు.
అసలేం జరిగిందంటే?
ముంబై(Mumbai)లోని మాతుంగాలోని మేజర్ ధడ్కర్ మైదాన్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 52 ఏళ్ల వ్యక్తి తలపై క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జయేష్ సావ్లా. మాతుంగా జింఖానా దడ్కర్ మైదానంలో జరిగిన ఓ టోర్నమెంట్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. తన జట్టు తరఫున ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తికి అదే మైదానంలో ఒకేసారి ఆడుతున్న మరో మ్యాచ్‌లోని బంతి తలకు తగిలింది. ఆ ప్రభావంతో అతడు స్పృహతప్పి పడిపోయాడు. ముంబైలోని ఒకే మైదానంలో అనేక మ్యాచ్‌లు జరగడం సర్వసాధారణం. కొన్నిసార్లు ఇతర మ్యాచ్‌ల బంతులు తగలడం వల్ల ఆటగాళ్లు గాయపడతారు. అయితే.. మ్యాచ్‌లో ఇలాంటి ప్రమాదంలో ఒకరు మృతి చెందడం ఇదే తొలిసారి.
పోలీసులు ఏం చెప్పారంటే?
మాతుంగా పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దీపక్ చౌహాన్ తెలిపిన ప్రకారం, ఈ కేసులో ప్రమాద మరణ నివేదిక (ADR) దాఖలు చేశారు. పోస్టుమార్టం అనంతరం జయేష్ సావ్లా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జయేష్ సావ్లా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. నిజానికి బాల్ తగిలిన వెంటనే సవ్లాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు.. ఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి వెళ్లకముందే అతను కుప్పకూలాడు. తలకు బలమైన గాయం కారణంగా చికిత్సకు ముందే ప్రాణాలు విడిచాడు. జయేష్ సావ్లాకు భార్య , కుమారుడు ఉన్నారు.
Also Read: ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు తాగితే మీ పని గోవిందే.. బాంబు పేల్చిన సైంటిస్టులు!
WATCH: