Samvidhaan Hatya Diwas: భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతీ సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని నిర్ణయించింది. 1975 ఎమర్జెన్సీ కారణంగా అమానవీయ బాధలను భరించిన వారందరిని ఆ రోజున స్మరించుకోవాలని సూచించింది.
ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా.. '1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతృత్వ ధోరణిని ప్రదర్శించారు. దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్య ఆత్మను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏ తప్పు చేయని లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారు. మీడియా గొంతును మూయించారు' అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఇక ఈ ప్రకటనపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘ఆనాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి ఎలాంటి పాలన సాగించిందో ఈ సంవిధాన్ హత్య దివస్ మనకు గుర్తుచేస్తుంది. దేశ చరిత్రలో కాంగ్రెస్ రాసిన చీకటి దశ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ స్మరించుకునే రోజు అది’ అంటూ పోస్ట్ పెట్టారు.