World Wide Road Accidents : దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు(Road Accident) పెరిగిపోతున్నాయి. రహాదారులన్నీ రక్తమోడుతున్నాయి. ప్రతిరోజూ దాదాపు 25 మందికిపైగా 18ఏళ్లలోపు పిల్లలు రోడ్డు ప్రమాదాలకు బలైపోతున్నారు. నిర్లక్ష్యం మాటున రోడ్డు మన సొంతమన్నట్టు తూలుతు, ఊగుతూ బండి నడిపిస్తే ఎలా? భారత్(India) లో దాదాపు ప్రతి మూడున్నర నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మీకు తెలుసా? ఓవైపు గుంతలు, ఎగుడుదిగుళ్లతో నరకానికి రూటు మ్యాపుగా మారిన రహదారులు.. మరోవైపు నిర్లక్ష్యం, అతివేగం, తాగిన మైకం..! అయితే ఇవే కాదు.. మరెన్నో విషయాలు రోడ్లు రక్తసిక్తమవడానికి కారణాలుగా మారుతున్నాయి. ఏంటా కారణాలు? అయిన వారికి కన్నీళ్ళు మిగుల్చుతున్నది కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగేనా? భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ వెనుకపడి ఉందా? ఈ విషయాలను ఇవాళ తెలుసుకుందాం..!
ప్రతి గంటకు 53 ప్రమాదాలు..
దేశంలో సగటున ప్రతిరోజూ 1,264 రోడ్డు ప్రమాదాలు, 462 మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ప్రతి గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు. ఇది లెక్క..! 2022లో జరిగిన 4,61,312 రోడ్డు ప్రమాదాల్లో 1,68,491 మంది మరణించారు. ప్రతీ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య, అటు మరణాల సంఖ్య పెరుగుతూ పోతోంది. రోడ్డు ప్రమాద మరణాలలో సగానికి పైగా జాతీయ, రాష్ట్ర రహదారులపైనే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి GDPలో 5 నుంచి 7శాతం నష్టం వాటిల్లుతుందని ప్రపంచబ్యాంక్ అంచనా..!
2022 రవాణా మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో 68 శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవించాయి. మొత్తం ప్రమాదాలు, మరణాల రేట్లు రెండింటిలోనూ ద్విచక్ర వాహనాలవే అత్యధికంగా ఉన్నాయి. బైక్ యాక్సిడెంట్ల శాతం 44.5గా ఉంది. అటు 19.5 శాతం మంది రోడ్డుపై నడిచే వ్యక్తులే ప్రమాదాలకు గురవుతున్నాయి. అంటే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం కూడా ఇండియాలో తప్పెనా? అటు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో 83.4 శాతం మంది 18-60 ఏళ్లలోపు ఉన్నావరే. అంటే ఇదంతా వర్కింగ్ గ్రూపు. ఈ ఏజ్ క్యాటగీరిపైనా భారత్ ఆర్థిక వ్యవస్థ(Indian Economy) ఆధారపడి ఉంటుంది.
Also Read : ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య
అతిపెద్ద నేరస్థులే అతిపెద్ద బాధితులు..
చాలా మంది ఊహించని మరో విషయం కూడా ఉంది. సాధారణంగా బైకు-లారీ యాక్సిడెంట్లు, లేదా కారు- ట్రక్కు యాక్సిడెంట్ల గురించి మనం ఎక్కువగా వింటుంటాం. అయితే ఆ రోడ్డు ప్రమాదాల్లో అతిపెద్ద నేరస్థులే అతిపెద్ద బాధితులు కూడా. అర్థంకాలేదా? ఓ బైకును మరో బైకు ఢీకొట్టే కేసులు భారీగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 2022 కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఓ టూ వీలర్ మరో టూ వీలర్‌ను ఢీకొట్టిన కేసులు మిగిలిన అన్నీ కేసులకంటే ఎక్కువ! ఇద్దరిలో ఎవరో ఒకరు రాంగ్ రూట్‌లో రావడం, ఓవర్ స్పీడ్‌గా డ్రైవ్ చేయడం.. తాగిన మత్తులో బండిని అడ్డగోలుగా నడపడం ఈ ప్రమాదాలకు అతి పెద్ద కారణాలు!
అటు కేవలం నిందంతా వాహనదారులపై వేస్తే అది తప్పే.. ఎందుకంటే రోడ్డు భద్రత లక్ష్యాలను చేరుకోవడంలో భారత్ చాలా వెనుకబడి ఉందని పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2030 నాటికి రహదారి మరణాలను సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్టాక్‌హోమ్ డిక్లరేషన్ 2020పై భారత్ సంతకం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ టార్గెట్‌ను రీచ్ అవ్వడానికి భారత్ చాలా దూరంలో ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రతీఏటా పెరుగుతున్న మరణాల సంఖ్యే ఉదాహరణ.