పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్‌లోని పిండి భట్టియాన్(bhattian) ప్రాంతంలో రన్నింగ్ బస్సులో(running bus) భారీగా మంటలు(bus caught fire) చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రయాణ సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు పేర్కొంది.
ఫైసలాబాద్ మోటార్ వే సమీపంలో పికప్ వ్యాన్ ను బస్సు ఢీ కొట్టిందని జిల్లా ఎస్పీ ఫహద్ వెల్లడించారు. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయన్నారు. రెండు వాహనాల్లోని డ్రైవర్లు అక్కడకక్కడే మరణించారని వివరించారు. ప్రయాణికుల్లో అత్యధికుల పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పి ప్రయాణికులను ప్రయత్నించారని చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ ప్రావిన్సులో ఇటీవల ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగింది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం రోజే పంజాబ్ ప్రావిన్సులో 17 మంది మరణించారు. ఈ ఏడాది మొత్తం 1659 ప్రమాదాలు జరగ్గా 1773 మందికి గాయాలయ్యాయని అధికారిక లెక్కలు తెలిపాయి.
లాహోర్ ప్రావిన్సులో ఈ నెల 13 జరిగిన ప్రమాదాల్లో 9 మంది మరణించారు. 1234 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1338 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాహోర్ ఆస్పత్రి క్షతగాత్రులతో నిండి పోయింది. ఇక స్వతంత్ర్య దినోత్సవం రోజు జరిగిన ప్రమాదాల్లొ 99 మందికి తలకు గాయాలయ్యాయని అత్యవసర సేవల విభాగం నివేదిక వెల్లడించింది.