Ayodhya : ఎప్పుడెప్పుడా అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎదురు చూస్తున్న తరుణం మరో మూడు రోజుల్లో జరగనుంది. జనవరి 22 న మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. సోమవారం నాడు జరిగే మహా సంప్రోక్షణ కార్యక్రమానికి నాలుగు రోజుల ముందు గురువారం (జనవరి 18) మధ్యాహ్నం అయోధ్య(Ayodhya) లోని రామ జన్మభూమి(Ram Janmasthan) ఆలయంలో రాముల వారి కొత్త విగ్రహాన్ని ఉంచారు.
ఐదు సంవత్సరాల వయసు..
రాముల వారు బాల రామునిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి రాముల వారు గర్భగుడిలో ఉన్న మొదటి చిత్రాన్ని ఆలయాధికారులు విడుదల చేశారు. శ్రీరాముడు ఐదు సంవత్సరాల వయసు కలిగి నిలబడి ఉన్న భంగిమలో స్వామి వారి విగ్రహాం ఉంది. దీనిని మైసూర్ కు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
ఈ విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ప్రస్తుతం రాముని విగ్రహాన్ని మొత్తాన్ని పరదాతో కప్పి ఉంచారు. గురువారం తెల్లవారుజామున మంత్రోచ్ఛారణల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. జనవరి 22 న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇష్టం లేదని..
ఆ తరువాత రోజు నుంచి ప్రజల కోసం ఆలయం తెరవడం జరుగుతోందని ఆలయాధికారులు వివరించారు. జనవరి 22న భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు రావద్దని మోడీ(Modi) ప్రజలను కోరారు. ఎందుకంటే ఆరోజున ఎక్కువ సెక్యూరిటీ ఉండడంతో పాటు కొన్ని నియమాలు కూడా ఉన్నాయని వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడడం తమకు ఇష్టం లేదని మోడీ తెలిపారు.
ఇంట్లో దీపాలు..
మంగళవారం నుంచి ప్రతి ఒక్క భక్తునికి ఆలయంలోనికి అనుమతి ఉంటుందని మోడీ వివరించారు. ఇదిలా ఉంటే జనవరి 22న ప్రతి భారతీయుడు కూడా తమ ఇంట్లో దీపాలు వెలిగించాలని మోడీ కోరారు. ఇప్పటికే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది.వారిలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కూడా ఉన్నారు.
ఈ వేడుకకు ఆలయ ట్రస్ట్‌లోని అన్ని ట్రస్టీలు, దాదాపు 150 శాఖల సీర్లు, "ఇంజనీర్ గ్రూప్" అని పేరు పెట్టబడిన ఆలయ నిర్మాణానికి సంబంధించిన 500 మందికి పైగా ప్రజలు కూడా హాజరవుతారు. ఇప్పటికే రామ మందిరంలో ఆలయంలో కొన్ని ఆచారాలను పాటిస్తున్నారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి ముందు ప్రధాని మోడీ కూడా కొన్ని నియమాలు, ఆచారాలను కచ్చితంగా పాటిస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రధాని కేవలం దుప్పటితో నేలపై నిద్రిస్తున్నారని, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.