బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ మసాలాలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. కుళ్లిన బియ్యం, ఆకులు, పాడైన చిరుధాన్యాలు, చెక్క పొట్టు, ఎండుమిర్చి తొడిమెలు, సిట్రిక్ యాసిడ్, నూనెలను కలిపి ఈ కల్తీ మసాలాలు తయారవుతున్నాయి. ఢిల్లీలో ఈ తరహా సాగుతున్న ఘరానా దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ఈశాన్య దిల్లీలోని కరవాల్ నగర్ లో కల్తీ మసాలాల తయారీ యూనిట్లపై మెరుపు దాడులు చేశారు. సుమారు 15 టన్నుల నకిలీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
'మసాలా దినుసుల్లో కల్తీ జరుగుతోందనే సమాచారంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. దిల్లీ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాం. దిలీప్ సింగ్ అనే వ్యక్తికి చెందిన ఒక ప్రాసెసింగ్ యూనిట్‌లో పాడైపోయిన ఆకులు, నిషేధిత పదార్థాలను ఉపయోగించి కల్తీ పసుపు తయారవుతున్నట్లు గుర్తించాం. బియ్యం, మినుములు, కలప పొట్టు, ఎండుమిర్చి తొడిమెలు, ఆమ్లాలు, నూనెలను కలిపి వీటిని తయారుచేస్తున్నట్లు కనుగొన్నాం. పారిపోయేందుకు ప్రయత్నించిన సింగ్‌తోపాటు సర్ఫరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాం. కల్తీ మసాలాలను ఖుర్షీద్ మాలిక్ అనే వ్యక్తి మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలింది. దీంతో అతన్ని కూడా అరెస్టు చేశాం. సర్ఫరాజ్‌కు కరవాల్ నగర్‌లోని కాలీ ఖాతా రోడ్‌లో మరో ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. ఈ ముఠా 2019 నుంచి కల్తీ మసాలా దినుసుల వ్యాపారం చేస్తోంది. ఈ రెండు యూనిట్లలో నిల్వ ఉన్న సుమారు 15 టన్నుల కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నాం’ అని డీసీపీ పవేరియా తెలిపారు.
సీజ్‌చేసిన వాటిలో నకిలీ పసుపు, గరం మసాలా, దనియాల పొడి 7,105 కిలోలు ఉందని డీసీపీ వివరించారు. అలాగే చెక్క పొట్టు, కుళ్లిన బియ్యం, మినుములు, సిట్రిక్ యాసిడ్ వంటి పదార్థాలు మరో 7,215 కిలోలు ఉన్నట్లు వివరించారు.
దేశంలో ప్రముఖ మసాలా బ్రాండ్లు అయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ తయారు చేసే ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే కేన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల గుర్తించడం తెలిసిందే. దాంతో హాంకాంగ్, సింగపూర్ లలో వాటి ఉత్పత్తులపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఈ నకిలీ మసాలాల తయారీ గుట్టు బయటపడటం గమనార్హం.