మణిపూర్‌లో చెలరేగిన హింస ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఆరుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున బిష్ణుపూర్ జిల్లాలో ఓ వర్గం వారిపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చురచాంద్ పూర్ నుంచి వచ్చిన వాళ్లే ఈ ఘటనకు కారణమని అధికారులు తెలిపారు.
ఘటన నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. మరో వర్గానికి చెందిన ఆందోళన కారులు చురచందాపూర్ వైపు బయలు దేరారు. ఇంపాల్‌లోని పశ్చిమ జిల్లా లాంగోల్ లో 15 ఇండ్లకు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. దీంతో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. హింసా కాండలో ఓ వృద్దునికి బుల్లెట్ తగిలినట్టు అధికారులు తెలిపారు. దీంతో అతన్ని ఇంపాల్ లోని రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేర్చినట్టు తెలిపారు. అతను ప్రాణాపాయం నుంచి భయటపడినట్టు వెల్లడించారు.
మరోవైపు ఇంపాల్ తూర్పు జిల్లా చెకాన్ ప్రాంతంలోనూ అల్లర్లు చెలరేగాయి. జిల్లాలో పలు వాణిజ్య సముదాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆ భవనానికి దగ్గర వున్న మూడు ఇండ్లకు కూడా నిప్పంటించినట్టు అధికారులు చెప్పారు. శనివారం చెలరేగిన అల్లర్లలో బిష్ణుపూర్ లో మెయిటీ తెగలకు చెందిన ముగ్గురు, చురచంద్ పూర్ లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మరణించినట్టు చెప్పారు.
హింసాకాండలో తాజా మరణాలతో కలిసి రాష్ట్రంలో ఇప్పటి వరకు 187 మంది మరణించారు. సుమారు 60 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. ఇక ఇంపాల్ పశ్చిమ జిల్లాలో శనివారం రాత్రి అల్లరి మూకలు పోలీసులపై దాడికి ప్రయత్నించాయని తెలిపారు. పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలను లాక్కొనేందుకు ప్రయత్నించాన్నారు. అల్లర్ల నేపథ్యంలో మణిపూర్ కు అదనపు బలగాలను పంపుతున్నట్టు కేంద్రం వెల్లడించింది.