ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో మధ్యాహ్న భోజనం తిన్న 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు మంగళవారం అధికారులు సమాచారం అందించారు. కోర్బా జిల్లా కేంద్రానికి 40 కి.మీ దూరంలోని కర్టాలా ప్రాంతంలోని బిర్త్రాయ్ గ్రామంలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన 14 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. భోజనం చేసిన తర్వాత పిల్లల ఆరోగ్యం క్షీణించడంతో, ఉపాధ్యాయులు వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.
ఆరుగురు చిన్నారులను చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, మరో ఎనిమిది మంది చిన్నారులను కోర్బా జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చామని అధికారులు తెలిపారు. వైద్య కళాశాల డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ మాట్లాడుతూ ఆహారం తీసుకున్న తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న ఎనిమిది మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఎనిమిది మంది పిల్లల పరిస్థితి సాధారణంగానే ఉందని అవినాష్ మెష్రామ్ తెలిపారు.
వెదురు కాండం కూర తినగానే వాంతులు అయ్యాయి అని విద్యార్థులు చెబుతుండగా... పాఠశాలలో ఆ కూర వండలేదని, కడి మాత్రమే చేసినట్లు డీఈవో తెలిపారు.