This 11 year old Hyderabad girl is on a mission to set up libraries: 11ఏళ్ల బాలిక అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నిరుపేద చిన్నారుల కోసం ఎవరూ చేయని పనిని చేసి చూపించింది. హైదరాబాద్‌కు చెందిన ఆకర్షణ(Akarshana)కు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఇష్టం, మక్కువ. అదే పుస్తకాల సేకరణకు కారణమయ్యింది. ఇటీవల తన తల్లిదండ్రులతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లింది ఆకర్షణ. ఆ సమయంలో అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడింది. తమకు పుస్తకాలంటే ఇష్టమని..అవి ఉంటే బాగుండేదన్నారు. నిరుపేద చిన్నారుల కోసం ఏదో చేయాలని ఆ బాలిక ఆలోచించింది. ఆకర్షణ, బాలిక తల్లిదండ్రులు..భారీగా పుస్తకాలను సేకరించారు. నిరుపేద చిన్నారుల కోసం 7 గ్రంథాలయాల(7 Libraries)ను ఏర్పాటు చేశారు. లైబర్రీలో అన్ని రకాల పుస్తకాలను ఉంచారు. నిరుపేద చిన్నారుల కోసం బాలిక చూపిన చొరవపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఆకర్షణకు పీఎంవో(Prime Minister of India), రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు దక్కాయి.
ఆకర్షణ ఏం చెప్పిందంటే? :
ఒక్కసారి చదవడం అలవాటు అయితే ఎప్పటికీ పుస్తకాలను వదలలేరంటోంది ఆకర్షణ. ఇంకా ఆమె మాట్లాడుతూ "నేను పిల్లలతో ముచ్చటించాను, మా కోసం పుస్తకాలను సేకరించాలని అభ్యర్థించారు.. అందుకే అపార్ట్‌మెంట్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను.. మంచి స్పందన వచ్చింది.. ప్రతి ఇంటికి వెళ్లి పుస్తకాలను సేకరించాను.. మొత్తం 5 వేల 800 పుస్తకాలను సేకరించాను" అని చెప్పింది. అంతేకాదు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చాలా జ్ఞానాన్ని ఇస్తాయంటోంది ఆకర్షణ. అదే సమయంలో ఇతర పుస్తకాలు చదివితే ఊహా ప్రపంచంలోకి వెళ్తారని.. వీటి వల్ల మనలో సృజనాత్మక ప్రక్రియ పెరుగుతుందని చెబుతోంది. ఇక ఆకర్షన తండ్రి కూడా తన కూతురి ఆలోచనా విధానం పట్ల ఎంతో సంతోషిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "మూడేళ్ల నుంచి కేవలం పుస్తకాలు మాత్రమే ఇచ్చాం.. ఎక్కడికి వెళ్లినా పుస్తకాలు, కథల పుస్తకాలను కొనుగోలు చేస్తాం.. అప్పటి నుంచి వాటిని చదవడం ప్రారంభించింది, పుస్తకాలతోపాటు న్యూస్ పేపర్లను ఆకర్షణ చదువుతోంది" అని చెప్పారు.
నెటిజన్ల నుంచి ప్రశంసలు:
ఆకర్షణ చేసిన పనిని అంతా మెచ్చుకుంటున్నారు. 11ఏళ్లకే ఇలా ఆలోచిస్తున్న ఆకర్షణ జీవితంలో మరింత ఉన్నతంగా ఎదుగుతుందని జోస్యం చెబుతున్నారు. ఆకర్షణ ఇప్పటివరకు ఏడుకి పైగా గ్రంథాలయాల్లో 5వేలకు పైగా పుస్తకాలను సేకరించి అందించింది. మొదటిది 1,046 పుస్తకాలతో MNJ క్యాన్సర్ చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఉండగా, రెండవ లైబ్రరీ సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో (829 పుస్తకాలు) ప్రారంభమైంది. తర్వాత హైదరాబాద్‌లోని బాలికల కోసం జువెనైల్ అండ్ అబ్జర్వేషన్ హోమ్‌లో (625 పుస్తకాలు), నాలుగోది బోరబండలోని గాయత్రి నగర్ అసోసియేషన్‌లో (200 పుస్తకాలు) ఉంది. 5th, 6th లైబ్రరీలు కోయంబత్తూర్ సిటీ పోలీస్ స్ట్రీట్ లైబ్రరీలలో (1,200 పుస్తకాలు), నోలంబూర్ పోలీస్ స్టేషన్‌లోని చెన్నై బాయ్స్ క్లబ్‌లో (610 పుస్తకాలు) ఉన్నాయి. ఆకర్షణ తన తండ్రి సతీశ్ కుమార్ నుంచి ప్రేరణ పొందిన్నట్టు చెబుతోంది.
Also Read: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి