Andhra Pradesh: అభ్యర్థుల ఖరారుపై జగన్‌ ఫోకస్‌..నేరుగా నేతలతోనే చర్చలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత, సీఎం జగన్. ఆయా నియోజకవర్గాల నేతలను పిలిపించుకుని నేరుగా మాట్లాడుతున్నారు. మార్పులు, చేర్పులపై చర్చలు జరుపుతున్నారు.

New Update
Andhra Pradesh: అభ్యర్థుల ఖరారుపై జగన్‌ ఫోకస్‌..నేరుగా నేతలతోనే చర్చలు..

AP CM YS Jagan: ఏపీ రాజకీయాల్లో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియక రాజకీయ నాయకులు ఫుల్‌ టెన్షన్‌ పడుతున్నారు. వైసీపీ నేతలు అయితే తమ పోస్టులు ఉంటాయో ఊడిపోతాయో తెలియక నిద్రాహారాలే మానేశారంటే అతిశయోక్తి కాదు. వారి భయానికి తగినట్లుగానే ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. సీఎం ఆఫీసు నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్‌ వస్తుందంటేనే వారు భయపడిపోతున్నారు. ఇప్పటికే జగన్‌ పలువురు ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ అయ్యారు. నియోజకవర్గాల పరిస్థితులు, పార్టీ బలంపై జగన్‌ అడిగి తెలుసుకుంటున్నారు. ఇలా భేటీ అయిన నేతల నియోజకవర్గాలు మారుస్తున్నట్లు సమాచారం రావడంతో ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు మొదలైంది. తమకు సీటు రాదు అనుకునే ఎమ్మెల్యేలంతా కూడా ఆఖరి ప్రయత్నంగా జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి కన్ఫర్మేషన్‌ తీసుకోవాలని నిశ్చయించుకున్నారు. తమకు కాకుంటే తమ ఫ్యామిలీలోనే సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కోరుతున్నారు. అసెంబ్లీ సీట్లు వదులుకునేందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు.

స్పీడు పెంచిన సీఎం జగన్‌..

మరో కొద్ది నెలల్లోనే ఏపీకి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జగన్‌ తన పార్టీ కార్యకలాపాల మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాగైనా సరే ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎమ్మెల్యేలకు ఆయన గట్టిగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నియోజకవర్గాలకు వైసీపీ ఇన్‌చార్జ్‌లను సైతం ఆయన మార్చారు. ఈ సమావేశాల్లో జగన్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమనే అంశాల గురించి ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఇన్‌ చార్జ్‌లను నియమించినా సీట్లు దక్కవని ఎవరూ అనుకోవద్దు. పార్టీలో అందరికీ కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని సీఎం చెబుతున్నారు.

మార్పులకు అవకాశాలు ఉండే నియోజక వర్గాలు..

రాజమండ్రి రూరల్‌, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పి.గన్నవరం, రామచంద్రాపురం. నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు, విజయవాడ వెస్ట్‌, విజయవాడ సెంట్రల్‌, తిరువూరు, అవనిగడ్డ, పెడన, దర్శి, పొన్నూరు, పెనుగొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం నియోజకవర్గాల మీద జగన్ ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా మరి కొన్ని నియోజకవర్గాల మీద కూడా జగన్‌ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మందికి నియోజకవర్గంలో సరిగా పనులు చేయాలని వార్నింగ్ ఇచ్చేందుకు జగన్ పిలుస్తున్నారని సమాచారం. దీంతో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వారి వినతులు వినిపించేందుకు సీఎం క్యాంప్‌ ఆఫీసుకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తాడేపల్లికి చేరుకున్నారు.

పలువురికి ఫోన్‌లో పిలుపు..

రాయలసీమ నుంచి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డిలతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్‌ కి కూడా క్యాంపు ఆఫీస్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు చేపట్టే మార్పుల తరువాత పూర్తి స్థాయి దృష్టి ఎన్నికల మీద పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే టికెట్‌ ఇవ్వని వారికి వైసీపీ ముందుగానే చెప్పేస్తుంది. ఇప్పటికే 11 సెగ్మెంట్లలో మార్పులు చేర్పులు జరిగాయి. ఇప్పటికే ప్లెస్‌ మారిన వారిలో కొందరు మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు. ఇప్పటికే మద్దాలిగిరి, టీజేఆర్‌ సుధాకర్‌ బాబు, తిప్పల నాగిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నో టికెట్‌ అని వైసీపీ చెప్పేసింది. సెకండ్‌ టైమ్‌ లో మరో ఐదుగురికి ఉద్వాసన పలికే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలువురు వైసీపీ సిట్టింగ్‌ నేతలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదు. గడిచిన వారం రోజుల నుంచి ఇప్పటి వరకు క్యాంప్‌ ఆఫీసుకు సుమారు 30 నుంచి 35 మంది ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా, ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చేందుకు జగన్‌ రెడీ గా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలోకానీ, రాష్ట విభజన తర్వాత కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో సిట్టింగ్‌లను అధికార పార్టీలు మార్చలేదు. ఎమ్మెల్యేల మీద స్థానిక వ్యతిరేకత, నియోజకవర్గ స్థాయిలో నేతలతో విభేదాలు, టీడీపీ-జనసేన పొత్తులో పోటీకి వచ్చే అభ్యర్థులను ఈ సమీకరణలలో జగన్‌ ముఖ్యంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమికి చెక్ పెట్టేలా సామాజిక సమీకరణలతో ఎమ్మెల్యేల మార్పు, తొలగింపు, కొత్త అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

Also Read:

హైదరాబాదీలకు బిగ్ షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు