MLC Vamshi Krishna: ఆంధ్రప్రధేశ్‌లో అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వంశీ కృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడిన వంశీ.. వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉన్నానని అన్నారు. అయితే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి ఇప్పుడు ఈ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇవాళ సొంత కుటుంబంలోకి వచ్చినట్లు తనకు అనిపిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎనలేని అభిమానం అని.. ఇప్పుడు ఆయన పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పవన్‌తో కలిసి పార్టీ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు వంశీ కృష్ణ. కాగా, కొన్ని దుష్టశక్తుల కారణంగా వైసీపీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్న ఆయన.. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఆఫ్ ది రికార్డ్‌లో సంచలన కామెంట్స్..
జనసేనలో చేరిన వంశీకృష్ణ.. తనతో ఎనిమిది మంది ఎమ్మెల్సీలు టచ్‌లో ఉన్నారని వ్యాఖ్యానించారు. 16 మంది జీవీఎంసీ కార్పొరేటర్లు తనకు అనుకూలంగా ఉన్నారని అన్నారు. తాను తలుచుకుంటే విశాఖ మేయర్‌ను మార్చేస్తానని వ్యాఖ్యానించారు. తన మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు.
చర్చలు విఫలం..
కాగా, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వంశీ.. విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. తన ప్రతిపాదనను పార్టీ అధిష్టానం ముందుంచారు. అయితే, వంశీ ప్రతిపాదనకు అధిష్టానం నో చెప్పింది. గాజువాక నుంచి పోటీ చేయాలని వంశీకి సూచించింది పార్టీ హైకమాండ్. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన వంశీ.. పార్టీ మారాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ జనసేనలో చేరుతున్నారంటూ వాట్సాప్ మెసేజ్‌లు, పార్టీ మారుతానని వంశీకృష్ణ అనుచరులతో అన్నట్లు వాయిస్ రికార్డ్స్ వైరల్ అయ్యాయి. దాంతో వైసీపీ అగ్రనాయకత్వం అలర్ట్ అయ్యింది. వంశీని బుజ్జగించేందుకు విశాఖ నగర పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు ని రంగంలోకి దింపింది. కోలా గురువులు.. వంశీకృష్ణతో చర్చలు జరిపినా.. అవి సఫలం కాలేదు. చివరకు ఆయన జనసేన పార్టీలో చేరారు. కాగా, వంశీ కృష్ణకు నారా కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ కన్ఫామ్ అని తెలుస్తోంది.
Also Read:
రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు