Shankar Reddy: ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన వివేకా హత్య కేసులోని ఐదవ నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ గా పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈరోజు శంకర్ రెడ్డి తరపున విద్యానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాగా వైఎస్ కంచుకోటగా ఉన్న కడపలో వైఎస్ కుటుంబంలోని ఒక వ్యక్తిని చంపాడని ఆరోపణలు వస్తున్న వ్యక్తి ఆ కుటుంబ సభ్యులపైనే ఎంపీగా పోటీ చేయడం చర్చనీయాంశమైంది. కాగా.. కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ పడుతుండగా.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా అదే స్థానంలో ఎంపీ గా పోటీ చేస్తున్నారు.
ALSO READ: సీఎం జగన్ వద్ద అప్పు చేసిన షర్మిల.. వెలుగులోకి కీలక విషయాలు!
శంకర్ రెడ్డి ఎవరు?
వివేకా హత్య కేసులో 5వ నిందితుడిగా శంకర్ రెడ్డి పేరును సీబీఐ చేర్చింది. ప్రస్తుతం ఇదే కేసులో కండిషన్ బెయిల్ పై దేవిరెడ్డి శంకర్ రెడ్డి బయట ఉన్నారు. హైదరాబాద్ ను విడిచి వెళ్ళకూడదంటూ సీబీఐ కోర్టు ఆంక్షలు పెట్టింది. ఈ క్రమంలో కడప కు రావడానికి తీవ్రంగా ప్రయత్నంలో భాగంగా నామినేషన్ వేసినట్లు సమాచారం. ప్రచారం నిమిత్తం కడపకు వెళ్లాలని కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే కడపకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.