/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ys-sharmila-2-jpg.webp)
వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మద్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. షర్మిలను హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్లో చిత్రహింసలకు గురైన మహిళా బాధితురాలను ఆమె పరామర్శించారు. బాధితురాలికి వెంటనే రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని.. లక్ష్మిపై థర్డ్ డిగ్రీ ఘటనపై వెంటనే విచారణ కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తున్నానని వెల్లడించారు. ఈ క్రమంలో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గిరిజన మహిళ లక్ష్మిపై పోలీసుల దాడి అమానుషమని షర్మిల మండిపడ్డారు. అర్ధరాత్రి మహిళ స్వేచ్చగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వతంత్రం అని గాంధీజి అన్నారని.. మరి ఇప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లా? రానట్లా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట మహిళ అని చూడకుండా స్వాతంత్య్రం వచ్చిన రోజు ఈ అరాచకం చేశారని మండిపడ్డారు. ఇది ఏ గూండాలు చేసిన పనికి కాదని.. రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడితే ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉందన్నారు. పోలీసులకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు.. ఇండియన్ పీనల్ కోడ్ అంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు రౌడీలకు, రేపిస్టులకు తేడా లేదన్నారు. కాకి చొక్కా వేసుకున్న గూండాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆగస్ట్ 15న పోలీసులకు మద్యం ఎక్కడ దొరికిందని ఆమె ప్రశ్నించారు. ఎస్సై, కానిస్టేబుళ్లు బాగా తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. మద్యం తాగి గిరిజన మహిళపై దారుణంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాళ్లను మృగాలతో పోల్చినా తప్పు లేదన్నారు. చర్యలు తీసుకున్నాం అని చెప్పి ఇద్దరు అమాయకులను సస్పెండ్ చేశారని తెలిపారు. దారుణానికి ఒడిగట్టిన ఎస్సై రవికుమార్‌ను మాత్రం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారని నిలదీశారు. FIR నమోదు చేయకుండా మహిళపై థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారని ప్రశ్నించారు. పోలీస్ శాఖ ఎందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదన్నారు. అర్ధరాత్రి మహిళ పోలీసులు లేకుండా లక్ష్మిని ఎలా అదుపులోకి తీసుకుంటారని షర్మిల మండిపడ్డారు.
పోలీసులు పైశాచిక ఆనందం పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అంట.. ఎవరికి మీరు ఫ్రెండ్లీ పోలీసులు? అని నిలదీశారు. మహిళలు మీ కంటికి మనుషుల్లా కనపడరా? ఇది ఎక్కడి దారుణం అని దుయ్యబట్టారు. పెళ్లి ఉందని వేడుకున్నా వదలలేదని.. బిడ్డ పెళ్లి కోసం తెచ్చుకున్న రూ.3లక్షలు, ఒంటి మీద ఉన్న నగలు కాజేశారన్నారు. మీరు అసలు మనుషులేనా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత దారుణం జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు బహిరంగంగా స్పందించలేదన్నారు.