కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అమగంపల్లి నుంచి APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ మనిషి అని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారన్నారు. ఇప్పుడు జగన్ (AP CM Jagan) ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదా లేదు, కడప స్టీల్ ప్లాంట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందన్నారు. ఇందుకు కారణం జగనేనని అన్నారు.
ఇది కూడా చదవండి: TDP-JSP : టీడీపీ, జనసేన కూటమిలో కుంపట్లు.. టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ..!
బాబాయిని చంపిన హంతకుడికి సీట్ ఇచ్చాడని అవినాశ్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేశారు షర్మిల. హంతకులను కాపాడడం దురదృష్టం, దుర్మార్గం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హంతకులు మళ్ళీ చట్ట సభలోకి వెళ్ళకూడదన్నారు. న్యాయం ఒక వైపు, అధికారం ఒక వైపు ఉందన్నారు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా? న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా? ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
హత్యా రాజకీయాలు చేసే అవినాష్ రెడ్డిని, కాపాడే జగన్ రెడ్డిని.. ఇద్దరినీ ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ దగ్గర జగన్ ఒక బానిసలా మారారని విమర్శించారు. బద్వేల్ నుంచి విజయజ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.