కేసీఆర్ క్షమాపణ చెప్పాలి..
పూర్తిగా చదవండి..తెలుగు ప్రజల కోసం పుట్టిన మనిషి గద్దర్ అని వైసీటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ బతికే ఉంటారన్నారు. అలాంటి గద్దర్ బతికి ఉన్నప్పుడు అవమానించిన కేసీఆర్.. ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన గద్దర్‌కి తొమ్మిదేళ్లుగా కేసీఆర్.. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రశ్నించిన గద్దర్‌ను జైల్లో సైతం పెట్టించారని.. చనిపోయిన తర్వాత మాత్రం ముసలి కన్నీరు కార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గద్దర్ కుటుంబ సభ్యులకు కేసీఅర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అల్వాల్‌లోని గద్దర్ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు..
ప్రజా గాయకుడు గద్దర్ గారి సమాధి వద్ద నివాళి అర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది. గద్దర్ తెలుగు ప్రజల కోసం పుట్టిన మనిషి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయన కృషి, కష్టం, త్యాగానికి గుర్తుగా ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి. గద్దర్ జీవిత చరిత్రను… pic.twitter.com/AmcOClmDiS
— YS Sharmila (@realyssharmila) August 13, 2023
ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం పెట్టాలి..
దివంగత వైఎస్సార్ అంటే గద్దర్‌కి ఎనలేని ప్రేమ అని.. తనతో చాలాసార్లు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారని పేర్కొన్నారు. గద్దర్ గుండెల్లో వైఎస్సార్ ఉన్నారని.. మన గుండెల్లో గద్దర్ ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ కోసం గద్దర్ కృషి, కష్టం, త్యాగానికి గుర్తుగా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్నారు. అలాగే స్వగ్రామైన తూప్రాన్‌లో స్మారక భవనం నిర్మించాలని షర్మిల కోరారు.
కాగా ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గద్దర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన పార్థివదేహనికి సీఎం కేసీఆర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. అనంతరం అభిమానుల అశ్రునయనాల మధ్య గద్దర్ అంత్యక్రియలు అల్వాల్‌లోని మహాబోధి హైస్కూల్లో జరిగాయి.
[vuukle]