Ananthapuram: అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి (Jonnalagadda padmavathi) సొంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అనంతపురం పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. శింగనమల ఎస్సీ నియోజకర్గం కాబట్టి తనను చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు. అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు మహిళ ఎమ్మెల్యే.
ఎందుకంత చిన్నచూపు?
'శింగనమల అంటే ఎందుకు అంత చిన్నచూపు? మా నియోజకర్గానికి నీళ్ళు తెచ్చుకునే హక్కు ఉన్నా..ఎందుకు మాకు నీళ్ళు ఇవ్వడం లేదు? కేవలం ఎస్సీ మహిళను కాబట్టే ఇంత చిన్న చూపు చూస్తున్నారా? ఎస్సీ నియోజకర్గంలో అన్ని కులాలు వారు ఉన్నారు కాదా? నాపై ఎందుకంత వివక్ష' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మీ కాళ్లు పట్టుకోవాలా?..
నియోజకర్గానికి నీళ్ళు వదులుకునే హక్కు ఉన్నప్పట్టికి నీటి కోసం అడుక్కునే పరిస్థితి వచ్చిందని వాపోయింది. ఇంకా, ఎన్ని సంవత్సరాలు ఇలా పోరాడాలి.. ఎదైనా మాట్లాడితే పెద్ద నేరం చేసినట్లు చూస్తారని కామెంట్స్ చేశారు. ఇదేళ్లు లో ఒక్కసారి నీళ్లు ఇవ్వడమే గొప్ప అన్నట్లు మాట్లాడుతున్నారని.. నీటి సమస్యపై ఇరిగేషన్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సమస్యపై సీఎంను కలిసి పరిష్కరిద్దాం అనుకున్న తనను అడ్డుకుంటున్నారని అన్నారు. అందరికి అనిగిమనిగి ఉండాలా? ఇగో సంతృప్తి పరచడం కోసం మీ కాళ్లు పట్టుకోవాలా? అంటూ ఘాటుగా స్పందించారు.
నియోజకవర్గం అభ్యర్థి మార్పు..
కేవలం వరదలు వస్తేనే మా నియోజకర్గానికి నీళ్ళు ఇస్తారా? అంటే మీకు నీళ్ళు ఎక్కువ అయినప్పుడు మాకు పారేస్తారు? లేదంటే లేదా? అంటూ ప్రశ్నించారు. అందరం నీటి కోసం ఫైట్ చేద్దాం అంటూ నియోజకర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు జరుగుతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. పద్మావతి కాకుండా తెరపైకి డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేరు వినిపిస్తోంది.