AP Politics - YCP: వరుస రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలు పార్టీకి షాకిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) రాజీనామా అనంతరం కొద్ది వ్యవధిలోనే గాజువాక వైసీపీ ఇన్చార్జి తిప్పల దేవన్‌రెడ్డి కూడా పార్టీకి టాటా చెప్పేశారు. ఇద్దరు ముఖ్య నాయకులు ఒకే రోజు పార్టీని వీడడంపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా, దేవన్ రెడ్డి రాజీనామా అనంతరం ఆయన స్థానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ను (Gudivada Amarnath) గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జిగా పార్టీ నియమించాలని పార్టీ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి షాక్ మీద షాక్.. వైసీపీ ఎమ్మెల్యే తనయుడు రాజీనామా!
గాజువాక అసెంబ్లీ స్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించి అందరి దృష్టినీ ఆకర్షించారు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. అయితే, ఈసారి ఆ స్థానాన్ని తన కుమారుడు దేవన్ రెడ్డికి ఇవ్వాలన్నది ఆయన ప్రధానమైన డిమాండ్. ఆయన ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తుండడం గమనార్హం. కీలకమైన సమయంలో పార్టీ ఇన్చార్జిగా ఉన్న దేవన్ రెడ్డి రాజీనామా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన పార్టీ కూడా మారుతారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతోపాటు ఎమ్మెల్యే నాగిరెడ్డి కార్యాచరణ ఎలా ఉంటుందోనన్న అంశంపైనా అనుచరులు ఎదురుచూస్తున్నారు.
దేవన్ రెడ్డి స్థానంలో మంత్రి అమర్నాథ్?
దేవన్‌రెడ్డి రాజీనామా అనంతరం గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి అదే జిల్లాకు చెందిన మంత్రి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమించాలని అధిష్టానం ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రచారం జరుగుతుండగా; తనకైతే ఇప్పటివరకూ పార్టీ నుంచి సమాచారం లేదంటున్నారు మంత్రి. మరోవైపు గంజి చిరంజీవి మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులవుతారని కార్యకర్తల్లో ప్రచారం జరుగుతోంది.