YS Jagan Into INDIA Alliance: వైసీపీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఈ రోజు ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ధర్నాలో ఊహించని రాజకీయ పరిణామాలో చోటు చేసుకున్నాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు మద్దతు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే నేతలు పాల్గొన్నారు. ఉదయం ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ధర్నాలో కూర్చొని జగన్ కు తన మద్దతు ప్రకటించారు. ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi), సంజయ్‌రౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు సైతం జగన్ దీక్షకు హాజరై తమ మద్దతు తెలిపారు. జగన్ పోరాటానికి కూటమి మద్దతు ఉంటుందని ఆయా నేతలు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం జగన్ ధర్నాకు దూరంగా ఉంది. ఇప్పటిదాకా ఇండియా, ఎన్డీఏ కూటములకు వైసీపీ దూరంగా ఉంటూ వచ్చింది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకే రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీకి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. అనేక బిల్లుల్లో సపోర్ట్ ఇచ్చింది. ఇటీవల స్పీకర్ ఎన్నిక సమయంలోనూ ఎన్డేఏకే మద్దతు ఇచ్చింది వైసీపీ.
Also Read: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్
తాజాగా ఇండియా కూటమి నేతలు జగన్ దీక్షలో పాల్గొనడంతో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. వైసీపీ ఇండియా కూటమిలో చేరుతుందా? అన్న చర్చ ప్రారంభమైంది. గత ఎన్నికల్లో ఏ కూటమిలో లేని వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఏదో ఓ కూటమిలో చేరాలన్న నిర్ణయానికి వైసీపీ వచ్చిందా? అన్న చర్చ సాగుతోంది. అయితే.. ఎన్డీఏలో టీడీపీ కీలకంగా మారడంతో వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తుందా? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
అయితే.. ఈ రోజు జగన్ ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీలు హాజరు కాగా.. కూటమిలోని ముఖ్య పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా జగన్ సోదరి షర్మిల ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ దారుణ పరాజయం తర్వాత కూడా షర్మిల అన్న జగన్ పై విమర్శల దాడి ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఇండియా కూటమిలోకి వెళ్తారా? లేక ఇప్పటిలాగా రెండు కూటములకు సమదూరంలో ఉంటారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చింది రుణమా..? గ్రాంటా…?