Jagan New Strategy: అప్పటివరకు చంద్రబాబు జైల్లోనేనా..! వైసీపీ స్కెచ్ ఇదేనా? ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు(Chandrabu) ఎపిసోడ్ కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ప్రజల్లో ఉంటూ.. అన్నీ తానై తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోసిన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థించే వాళ్లు కొందరైతే.. వ్యతిరేకించేవాళ్లు మరికొందరు. By Jyoshna Sappogula 13 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి CM Jagan New Strategy: ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎపిసోడ్ కలకలం రేపుతోంది. నిన్నటి వరకు ప్రజల్లో ఉంటూ.. అన్నీ తానై తెలుగుదేశం పార్టీ బాధ్యతలు మోసిన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్‌ను సమర్థించే వాళ్లు కొందరైతే.. వ్యతిరేకించేవాళ్లు మరికొందరు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఆయన తరపు లాయర్లు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావడంలేదు. మరోవైపు వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలుకే పరిమితం చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వచ్చినా.. మిగిలిన కేసుల్లో పిటి వారెంట్ జారీచేసి చంద్రబాబును జైల్లోనే ఉంచేలా ఏపీ ప్రభుత్వం స్కెచ్ వేసిందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పు కేసులో చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో ఇప్పటికే పోలీసులు పిటిషన్ ఫైల్ చేశారు. దీంతో చంద్రబాబును ఇప్పటిలోగా ప్రభుత్వం వదిలేలా లేదనే చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలను చంద్రబాబు నాయుడు మోస్తూ వస్తున్నారు. 40 దశాబ్దాలుగా క్రీయాశీల రాజకీయాల్లో ఉంటూ దేశంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు.. 2019 తర్వాత నుంచి పాలిటిక్స్‌లో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటూ వస్తున్నారనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. 2014లో ఏపీ విభజన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వంతో విబేధించిన తర్వాత నుంచి ఆయన రాజకీయంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2019 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి చాలా మంది నాయకులు దూరమయ్యారు. దీంతో టీడీపీ మనుగడ కష్టమనే ప్రచారం సాగింది. కాని చంద్రబాబు నాయుడు తన రాజకీయ ఎత్తుగడలతో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తమ పార్టీకి కలిసొచ్చేలా తనదైన వ్యూహాలతో ముందుకెళ్తూ వస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయని.. వాటన్నింటిపై విచారణ చేస్తున్నామంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే విషయం పక్కన పెడితే.. ప్రజాధనాన్ని లూటీ చేశారని.. ఆ కారణంతోనే ఆయన జైలులో ఉన్నారని.. మరోసారి అధికారం ఇస్తే మరిన్ని అక్రమాలు చేస్తారనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబును, ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనేదే వైసీపీ వ్యూహాంగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత.. ఒకట్రెండు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అంతా భావించారు. కాని దాదాపు మూడు రోజులు గడవడంతో పాటు.. వచ్చే సోమవారం వరకు ఆయనకు సంబంధించిన క్వాష్, బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా వేయడంతో ఆయన మరో ఐదు రోజులు జైలులోనే ఉండాల్సి ఉంది. కాని..స్కిల్ కేసులో బెయిల్ వచ్చినా.. ఆ కేసులో రిమాండ్ ను కోర్టు రిజెక్ట్ చేసినా.. ప్లాన్ బిని ప్రభుత్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన పూర్తి చేసుకుని విజయవాడ వచ్చిన తర్వాత.. డీజీపీ, ఎసీబీ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్‌తో సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన అవినీతి, ఆరోపణలతో పాటు.. ఇతర కేసులను బయటకు తీసుకురావాలని.. ఆకేసుల్లో విచారణ మరింత వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ కేసును తెరమీదకు తెచ్చిన ప్రభుత్వం.. చంద్రబాబు నాయుడు ఎన్నికలయ్యే వరకు జైల్లో ఉండేలా ఒక్కో కేసును వరుసగా తెరమీదకు తేవాలనే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా అంగళ్లులో పోలీసులపై దాడి చేసిన కేసుతో పాటు.. ప్రకాశం జిల్లాలో తొక్కిసలాట కేసు, అనపర్తిలో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆంటంకం వంటి కేసులను తెరమీదకు తెచ్చి.. పీటీ వారెంట్‌తో ఆయనను జైల్లోనే ఉంచే ప్లాన్ వైసీపీ ఉందనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు చూస్తుంటే టీడీపీ శ్రేణులు సైతం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ అధినాయకుడు జైల్లో ఉంటే పార్టీకి వచ్చే సానుభూతి పక్కనపెడితే.. నాయకత్వ లేమితో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారుకావడంతో పాటు.. అంతర్గత విభేదాలు పెరిగి.. పార్టీకి నష్టం కలుగుతుందనే అభిప్రాయంలో క్యాడర్ ఉన్నట్లు చర్చ సాగుతోంది. మరోవైపు ముందస్తు ఎన్నికలు జరగొచ్చనే చర్చ ఉంది. జమిలీ ఎన్నికలకు కేంద్రం వెళ్తే షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయని, ఒకవేళ జమిలీ ఎన్నికలకు వెళ్లకపోతే.. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే యోచనలోనూ జగన్ ఉన్నారనే మరో ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ పది రోజుల్లో చంద్రబాబుకు బెయిల్ రాకపోతే మాత్రం.. కనీసం ఓ మూడునెలలు ఆయన్ను జైల్లో ఉంచి.. ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ ఎన్నికలతో పాటు ఎన్నికలకు వెళ్లాలనే ప్లాన్‌లో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చంద్రబాబు ఎన్నికలయ్యే వరకు జైల్లోనే ఉంటారా.. ఈలోపే బయటకు వస్తారా అనేది సోమవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ తర్వాత తేలనుంది. Also Read: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి