Boppana Bhava Kumar: ఏపీ అధికార పార్టీ వైసీపీకి షాక్ తగలనుంది. విజయవాడ వైసీపీ నేత బొప్పన భవకుమార్ టీడీపీలో చేరనున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి తో కలిసి ఈ నెల 21న టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన వారికి వైసీపీలో గౌరవం లేదని.. వైసీపీలో ఎవరూ ఇమడలేని పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించారు.
మానసిక క్షోభ
విజయవాడ వైసీపీ లో పెత్తనం మొత్తం ఒక్కడి చేతిలోకి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి సొంత నిర్ణయాలు వారివి తప్పితే పార్టీలో గౌరవం లేదని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని తరలింపు నిర్ణయం నుంచి ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ తెలుగుదేశం నేతలకు తాను సహాయకుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అవకాశవాద రాజకీయాలు చేయటానికి తాను ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి తెలుగుదేశంలో చేరట్లేదని వివరించారు.
Also Read: రసవత్తరంగా మారిన విశాఖ సీటు..కన్నేసిన పురంధేశ్వరి, జీవీఎల్
టీడీపీ గూటికి
2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బొప్పన భవ కుమార్ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. తాజాగా, వైసీపీపై అసహనం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నేతలు కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్ వెళ్లారు. వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న భవకుమార్ టీడీపీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేన్నట్లుగా కనిపిస్తోంది.