Yatra 2 : నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్

వైఎస్ జగన్ బయోపిక్ లాంటి యాత్ర 2 సినిమా ఈరోజు థియేటర్లో విడుదల అయింది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ఎలా ఉంది? అనే విషయాన్ని ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకోండి.

New Update
Yatra 2 : నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్

Yatra 2 Movie Review : ఇప్పుడు ఎన్నికల సీజన్. మిగిలిన భాషల్లో కన్నా.. తెలుగులో ఎన్నికల సీజన్ లో రాజకీయాలను దట్టించిన సినిమాలు ఎక్కువగానే వదులుతుంటారు. అందులోనూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు(AP Politics) నువ్వా.. నేనా అన్న రేంజిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ చిత్రాల హడావుడీ పెరిగింది. అయితే, రాజకీయ నేపథ్యంలో సినిమాలు రావడం వేరు.. రాజకీయాలే సినిమాలో చూపించడం వేరు. ఈ రెండిటినీ మించి రాజకీయ నాయకుల జీవితాలనే సినిమాలుగా తీయడం ఇప్పుడు ట్రెండ్. ఒక పార్టీ నాయకులను కించపరిచేలా.. ఇంకో రాజకీయ పార్టీ నేతల్ని హీరోలుగా చూపిస్తూ సినిమాలు ఎక్కువగానే తీస్తున్నారు. వాటిలో కొన్ని విడుదలై ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియకుండా మాయం అయిపోతున్నాయి. కొన్ని వివాదాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ విడుదల అవుతాయో లేదో తెలియకుండా ఉండిపోతున్నాయి. అయితే, ఇలాంటి రాజకీయ సినిమాలను బయోపిక్స్(Political Biopics Movies) తరహాలో తీసి మెప్పించడంలో దర్శకుడు మహీ వి.రాఘవ్ స్టైల్ వేరు. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో యాత్ర(Yatra) అంటూ దివంగత నేత వైఎస్సార్(YSR) రాజకీయ జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకునే ఆయన పాద యాత్ర(Padayatra) ను స్ఫూర్తిగా తీసుకుని సినిమా తీశాడు. అది ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే పొందింది. రాజకీయంగా కూడా వైసీపీకి కాస్త మైలేజీని ఇచ్చింది. అదే ఊపులో మహీ వి. రాఘవ్ యాత్ర 2 పేరుతో వైస్సార్ తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రను వెండితెరపైకి తీసుకువస్తానని ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు ఆ సినిమాని ప్రేక్షకులకు అందించారు. మరి యాత్ర సినిమాలానే ఇది కూడా ఆకట్టుకుంటుందా? అసలు సినిమా రాజకీయంగా ఎంత ప్రభావవంతంగా ఉంది? సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో

సమకాలీన రాజకీయాలతో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే. అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ తేడా వచ్చినా రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి తయారవుతుంది. అందుకే అనుకుంటా.. మహీ వి.రాఘవ్ యాత్ర 2(Yatra 2) సినిమా గురించి ఎప్పుడు మాట్లాడినా.. ఇది రాజకీయాలకు సంబంధించిన సినిమా కాదు.. ఒక తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు ఎలాంటి కష్టాలను ఎదుర్కున్నాడు అని చెప్పే కథ. అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. సినిమా తీయడం కూడా అలానే తీసాడు. ఇందులో వైఎస్సార్.. జగన్.. ఇలా రాజకీయ సంబంధమైన పాత్రలు ఉండేలా చేయడం చేత ఇది రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న సినిమా అయింది. లేకపోతే, మామూలుగా చూస్తే చాలా సాదాసీదా తెలుగు సినిమా ఇది. సాధారణ కథకి వైఎస్ జగన్(YS Jagan) జీవితంలో జరిగిన సంఘటనలను కలగలిపి.. సినిమాకు హైప్ తీసుకు రావాలని చేసిన ప్రయత్నంలో మహీ వి.రాఘవ్ నూటికి నూరు శాతం విజయవంతం అయ్యాడని చెప్పాలి. యాత్ర సినిమా ఎలా అయితే, ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అలానే ఈ సినిమా కూడా కనెక్ట్ అవుతుంది. అయితే, రాజకీయాల పరంగా వైఎస్ జగన్ అభిమానులకు.. వైసీపీ పార్టీతో మమేకం అయిన వారికీ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఊపిరి తిప్పుకోనీయని ఉద్వేగాన్నిస్తుంది.

సినిమా కథ.. కథనం ఇవన్నీ చెప్పుకోవడం పెద్దగా అవసరం లేదు. వైఎస్ జగన్ రాజకీయా ప్రస్థానమే ఈ యాత్ర 2. అందువల్ల కథను పక్కన పెడితే.. ఇది పూర్తిగా దర్శకుడు మహీ వి.రాఘవ్ సినిమా. అవతలి పక్షాన్ని ఎక్కడా కించపరచకుండా.. వైఎస్ జగన్ లోని హీరోయిజాన్ని ప్రాజెక్ట్ చేస్తూ సినిమా నడిపించిన విధానం చాలా బావుంది. చంద్రబాబు, సోనియాగాంధీలను సినిమాలో తప్పుగా చూపించే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ, అటువంటి ప్రయత్నాల జోలికి పోకపోవడమే ఈ దర్శకుడి గొప్పతనం. సినిమాని సినిమాగానే చూడాలి అంటే.. యాత్ర 2 ఎమోషనల్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. తండ్రి.. కొడుకు మధ్య బంధం.. రాజకీయాల నేపథ్యంలో తాను తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒక కొడుకు చేసే పోరాటం అంతా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఇక అభిమానులకు గూస్ బంప్స్ గ్యారెంటీ.

Also Read : విజయ్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన రజనీకాంత్‌.. ఏమన్నారంటే

సినిమాలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం డైలాగ్స్.. ప్రతి సీన్ లోనూ ఒక్కో డైలాగ్ థియేటర్లలో చప్పట్లు కొట్టించే రేంజ్ లో రాసుకున్నాడు మహీ వి.రాఘవ్. ప్రతి డైలాగ్ అద్భుతంగా ఉంది. సినిమా కథనానికి డైలాగ్స్ సగం బలం అందించాయని చెప్పవచ్చు. ఇక సినిమాలో నటీనటుల విషయానికి వస్తే.. కొద్దిసేపే అయినా మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి మళ్ళీ వైఎస్సార్ ను తీసుకువచ్చేశాడనిపిస్తుంది. ఆ పాత్రకోసమే మమ్ముట్టి అన్నట్టు చేశాడు. ఇక వైఎస్ జగన్ గా జీవా జీవించాడని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే దాదాపుగా వైఎస్ జగన్ ని చూసినట్టే చాలాసార్లు అనిపిస్తాడు. బహుశా అలానే చేయాలి అని కొంత అనుకరణ చేసినట్టు ఉన్నాడు. ఏమైనా జగన్ పాత్రకి సరిగ్గా సరిపోయాడు జీవా. ఇక భారతిగా నటించిన కేతకీ నారాయణన్ ఫర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు అన్నీ ఒకే అనిపించేలా ఉన్నాయి. టెక్నీకల్ గా కూడా సినిమా బావుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం, నేపధ్యసంగీతం సినిమాకి సరిగ్గా అమిరాయి.

మొత్తమ్మీద చూసుకుంటే.. రైట్ టైమ్ లో వైసీపీకి ఒక మంచి ప్రచార చిత్రం దొరికింది. అలానే వైసీపీ అభిమానులకు ఒక బూస్టప్ ఇచ్చే సినిమాగా యాత్ర 2 నిలుస్తుంది. ఇప్పటివరకూ వచ్చిన టాక్ చూస్తే అంతా పాజిటివ్ గానే ఉంది. ప్రత్యర్థుల విమర్శలు.. రాజకీయాలు పక్కన పెడితే.. ఒకసారి చూడవలసిన సినిమాగానే దీన్ని చెప్పొచ్చు.

చివరిగా ఒక్కమాట.. సినిమాలు ఓట్లు తెచ్చిపెడతాయని నమ్మితే కనుక.. ఈ సినిమా వైసీపీకి మళ్ళీ పట్టం కట్టేస్తుంది అని చెప్పుకోవచ్చేమో.

Advertisment
తాజా కథనాలు