ఇండియా, పాక్‌ వరల్డ్ కప్‌ మ్యాచ్‌ డేట్‌ ఫిక్స్‌! ఎప్పుడంటే..?

ప్రపంచకప్‌లో అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తు.. ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ మరో ఎత్తు. షెడ్యూల్‌ ప్రకారం ఇరు జట్లు అక్టోబర్‌ 15న అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో తలపడాల్సి ఉండగా.. ఆ డేట్‌ని రీషెడ్యూల్‌ చేయనుంది బీసీసీఐ. అక్టోబర్ 15 నవరాత్రుల్లో తొలి రోజు కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ని ముందుగా జరిపే అవకాశం కనిపిస్తోంది.

ఇండియా, పాక్‌ వరల్డ్ కప్‌ మ్యాచ్‌ డేట్‌ ఫిక్స్‌! ఎప్పుడంటే..?
New Update

ఇండియా(India) వర్సెస్‌ పాక్‌(pakistan) మ్యాచ్‌ అంటే క్రికెట్‌(cricket) అభిమానులకు పూనకాలే.. కేవలం భారత్, పాకిస్థాన్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. యావత్‌ క్రికెట్ ప్రపంచం ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే టీవీలకు అతుక్కుపోతారు. అటు స్టేడియం నిండిపోతుంది.. టికెట్ల కోసం జనం ఎగపడతారు. అందులోనూ వరల్డ్‌ కప్‌(world cup) లాంటి మెగా టోర్నిలో ఇండియా, పాక్‌ తలపడుతున్నాయంటే ఆ కిక్కే వేరు. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమవుతుండగా.. టోర్నమెంట్‌ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారం ఇండియా, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగాల్సి ఉండగా.. దాన్ని రీషెడ్యూల్‌ చేసే పనిలో బిజీగా ఉంది బీసీసీఐ.

ఒక్క రోజు ముందుకు?
అక్టోబర్ 15న జరగాల్సి ఉన్న మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీనిపై ఈరోజే (జులై 31) అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ సెక్రటరీ జయ్‌ షా అధ్యక్షతన ఇవాళ జరగనున్న భేటీలో బోర్డు షెడ్యూల్‌ మార్పుపై ప్రకటించే ఛాన్స్‌ ఎక్కువగా కనిపిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఒక్క రోజు ముందుగా.. అంటే అక్టోబర్‌ 14కు మ్యాచ్‌ని రీషెడ్యూల్‌ చేయనున్నట్టు సమాచారం. అక్టోబర్ 15 నవరాత్రుల్లో తొలి రోజు కావడంతో షెడ్యూల్‌ని మార్చనున్నారు. అయితే దీనిపై కూడా గందరగోళం నెలకొంది.

ఒక్క రోజు గ్యాప్‌?
షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఇప్పుడు పాక్‌ వర్సెస్‌ ఇండియా మ్యాచ్‌ని అక్టోబర్‌ 14కు రీషెడ్యూల్ చేస్తే బాబర్‌ జట్టుకు కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఇది కరెక్ట్ కాదన్నది నిపుణుల మాట.. పాక్‌ క్రికెట్‌ కూడా దీన్ని అంగీకరించదు.. అందుకే టోర్నీ మొత్తాన్ని కొత్త డేట్స్‌తో రీషెడ్యూల్‌ చేయనుంది బీసీసీఐ. పలు బోర్డుల నుంచి ఇప్పటికే ఈ తరహా ప్రతిపాదనలు వచ్చాయి. ఒక్క మ్యాచ్‌కి మరో మ్యాచ్‌కి మధ్య కనీసం 3-4 రోజుల వ్యవధి ఉండాలన్నది మిగిలిన క్రికెట్ బోర్డుల ఆలోచన. వారి అభిప్రాయాలకు తగ్గట్టుగానే బీసీసీఐ షెడ్యూల్‌లో మార్పులు చేయనుండగా.. వేదికలు మాత్రం మారే ప్రసక్తి లేదు. ఇక ప్రపంచ కప్ చరిత్రలో పాక్‌‌పై టీమిండియాదే పైచేయి.. ఒక్కటంటే ఒక్కసారి కూడా ఇండియా ఓడిపోలేదు. మొత్తం 7సార్లు ఇరు జట్లు తలపడితే ప్రతిసారీ టీమిండియానే గెలిచింది. పాక్‌పై 7-0 హెడ్ టు హెడ్ రికార్డును కలిగి ఉన్న టీమిండియా... చివరిసారిగా 2019 ప్రపంచ కప్‌లో తలపడింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe