World Athletics Championships: ఆసియా రికార్డు బద్దలుకొట్టిన ఇండియా రిలే జట్టు

New Update
World Athletics Championships: ఆసియా రికార్డు బద్దలుకొట్టిన ఇండియా రిలే జట్టు

World Athletics Championships: హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు. స్వర్ణ పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. అనుకున్నట్లు జరిగితే ప్రపంచ దేశాల ముందు మరోసారి త్రివర్ణ పతకం రెపరెపలాడనుంది. ఇప్పటికే గోల్డెన్ బాయ్ నీరజ్ బోప్రా జావెలిన్ త్రో ఫైనల్స్‌లో అడుగుపెట్టగా.. తాజాగా భారత పురుషుల రిలే జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌కు క్వాలిఫై కావడమే కాదు.. ఆసియా రికార్డును కూడా బద్దలుకొట్టి రికార్డు సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల 4X400 మీటర్ల హీట్స్‌లో టీమిండియా బృందం మహ్మద్ అజ్మల్, మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, రాజేశ్ రమేశ్‌లు చిరుతల్లా పరిగెత్తి 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి రెండో స్థానంలో నిలిచింది.

ఆసియా రికార్డు బద్దలు..

వరల్డ్ అథ్లెటిక్స్‌లో 4X400 విభాగంలో భారత్ ఫైనల్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం గర్వకారణం. అంతేకాకుండా 2 నిమిషాల 59.05 సెకన్లతో గతంలో ఉన్న జపాన్ బ‌ృందం(2 నిమిషాల 59.51 సెకన్ల) రికార్డును బద్దలు కొట్టి ఆసియాలోనే తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఈ రిలే పోటీలలో అమెరికా బృందం 2 నిమిషాల 58.47 సెకన్లలోనే రేసు పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచింది. భారత్, ఆస్ట్రేలియాతో పాటు గ్రేట్ బ్రిటన్, బొట్స్‌వానా, జమైకా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ బృందాలు కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఆదివారం(ఆగస్టు 27) రాత్రి తుది పోరు జరుగనుంది.

స్వర్ణం గెలవాలనే కసితో నీరజ్ చోప్రా..

ఇక ఇవే పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఇప్పటికే ఫైనల్ చేరుకున్నాడు. గతేడాది ఇదే ఈవెంట్‌లో రజతం గెలుచుకున్న నీరజ్.. నేడు జరిగే ఫైనల్‌లో స్వర్ణం గెలవాలనే కసితో ఉన్నాడు. క్వాలిఫై రౌండ్‌లో తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్లు విసిరి ఫైనల్‌లోకి దూసుకెళ్లడమే కాకుండా పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాడు. ఫైనల్స్‌‌లో జులియన్ వెబర్, వాద్లెచ్‌తో పాటు దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్‌తో పోటీ పడనున్నాడు. ఇక రెండు విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధించాలని కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు