Stroke Symptoms in Women: బ్రెయిన్ స్ట్రోక్‌ను.. స్ట్రోక్ లేదా సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని కూడా పిలుస్తారు. శరీరంలోని ఒక భాగానికి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఇది సంభవిస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. వివిధ రకాల స్ట్రోక్‌లకు దారితీస్తుంది. స్ట్రోక్స్ పురుషులు, మహిళలు ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది. ఈ స్ట్రోక్‌కి అంతర్లీనంగా అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ఎక్కువ శాతం మహిళలకు దీని ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రమాద కారకాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. పురుషులు, స్త్రీల మధ్య స్ట్రోక్ ప్రమాదంలో కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. ఉదాహరణకు.. మహిళలు హార్మోన్ల మార్పులు, గర్భం, రుతువిరతికి సంబంధించిన ప్రమాద కారకాలను కలిగి ఉండవచ్చు. కొన్ని అధ్యయనాలు స్త్రీలు కొద్దిగా భిన్నమైన స్ట్రోక్ లక్షణాలను అనుభవించవచ్చని, పురుషులతో పోలిస్తే స్ట్రోక్ నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నాయి. మహిళల్లో స్ట్రోక్ లక్షణాల గురించి ఎంత త్వరగా తెలుసుకుంటే.. అంత మంచిది. ముఖ్యంగా మహిళలు స్ట్రోక్‌కు సంబంధించిన 7 లక్షణాలను అస్సలు విస్మరించొద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ 7 లక్షణాలు ఏంటో ఓసారి చూద్దాం..
Also Read: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. మిషన్ గగన్‌యాన్‌లో తొలి ప్రయోగం
1. ఆకస్మిక తిమ్మిరి / బలహీనత: మహిళలు ముఖం, చేయి లేదా కాలు, ముఖ్యంగా శరీరం ఒక వైపున ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనతగా అనిపించొచ్చు. ముఖంలో ఒక భాగం తిమ్మిర్లు రావడం, ఒక చేయి పైకి లేపలేకపోవడం జరుగుతున్నట్లయితే.. వెంటనే అలర్ట్ అవ్వండి.
2. మాట్లాడటం, వినడంలో సమస్య: స్త్రీలు మాట్లాడటం లేదా మాట్లాడిన దానిని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అస్పష్టమైన ప్రసంగం, అసంబద్ధమైన మాటలు స్ట్రోక్‌కు సంకేతం కావచ్చు.
3. తీవ్రమైన తలనొప్పి: ఆకస్మిక, తీవ్రమైన తలనొప్పి స్ట్రోక్ లక్షణం కావచ్చు. ప్రత్యేకించి ఇది ఇతర లక్షణాలతో కూడి ఉంటే.
4. దృష్టి సమస్యలు: అస్పష్టమైన దృష్టి, డబుల్ దృష్టి, ఒకటి లేదా రెండు కళ్లలో ఆకస్మిక దృష్టి కోల్పోవడం అనేది స్ట్రోక్‌కు సూచిక.
5. తలతిరగడం, బ్యాలెన్స్ కోల్పోవడం: అస్థిరంగా అనిపించడం, తల తిరగడం లేదా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవడం, సమన్వయం కోల్పోవడం అనేది స్ట్రోక్‌కు సంకేతం.
6. గందరగోళం: మహిళలు అకస్మాత్తుగా గందరగోళానికి గురవుతారు. దిక్కుతోచని స్థితిలో ఉండవచ్చు. వారి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతారు.
7. నడవడంలో ఇబ్బంది: నడకలో ఇబ్బంది ఏర్పడుతుంది. సమన్వయ లోపం లేదా అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోవడం కూడా స్ట్రోక్‌ను సూచిస్తాయి.
మీకు గానీ.. మీకు తెలిసిన ఎవరిలోనైనా గానీ.. ఈ లక్షణాలు అనుభవిస్తే, తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రోక్‌ను ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేస్తే, అంత త్వరగా కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. తద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని తగ్గించవచ్చు.
Also Read: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..