YS Jagan-Sharmila: షర్మిల, జగన్ కలవబోతున్నారా?

ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హాజరై మద్దతు తెలపడంతో ఏపీలో కొత్త చర్చ ప్రారంభమైంది. జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న చెల్లి షర్మిలతో కలిసి జగన్ పని చేయాల్సి ఉంటుంది.

New Update
YS Jagan-Sharmila: షర్మిల, జగన్ కలవబోతున్నారా?

కార్యకర్తను చంపారని ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్.. మరి సొంత చిన్నాన్నను గొడ్డలితో నరికితే న్యాయం కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? రెండ్రోజుల క్రితం అన్నపై ఏపీపీసీసీ చీఫ్‌ షర్మిల ఎక్కుపెట్టిన విమర్శ ఇది. ఈ ఏడాది జనవరి 16న ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జగన్ పై షర్మిల విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వివేకా హత్య కేసును పదే పదే ప్రస్తావిస్తూ అన్నను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. కడప ఎంపీగా బరిలోకి దిగి వైఎస్ కంచుకోటలో వైసీపీకి చిక్కులు తెచ్చారు. ఈ ఎన్నికల్లో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోయినా.. జగన్ దారుణ ఓటమిలో మాత్రం ఆమె కీలక పాత్ర పోషించారన్న విశ్లేషణలు ఉన్నాయి. అనేక మంది వైసీపీ నేతలు సైతం ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు.

ఓటమి తర్వాత కూడా వదలని చెల్లి..
అయితే.. ఓటమి తర్వాత కూడా షర్మిల అన్నను వదిలిపెట్టడం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా నాశనమైందని విమర్శలు చేస్తున్నారు. దీన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందని ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే ప్రకటన విడుదల చేశారు షర్మిల. తద్వారా అన్న దారుణ ఓటమి తర్వాత కూడా షర్మిలకు ఆయనపై కోపం చల్లారలేదని స్పష్టమవుతోంది. తండ్రి రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సైతం జగన్ పై షర్మిల విమర్శలు గుప్పించారు. నాన్న జయంతి రోజు జగన్ ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారని ఫైర్ అయ్యారు. సిద్ధం సభలకు వందల కోట్లు ఖర్చుపెట్టిన మీరు వైఎస్ఆర్ జయంతికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. ఒక సభ పెట్టి ఆయనకు నివాళి కూడా అర్పించలేకపోయారని నిప్పులు చెరిగారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు? అంటూ.. ధ్వజమెత్తారు. అసలే అధికారం కోల్పోయానన్న బాధలో ఉన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసు మాదిరిగా తయారయ్యారన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

జగన్ ఢిల్లీ దీక్షలో ఇండియా కూటమి నేతలు..
ఇదిలా ఉంటే.. నిన్న ఢిల్లీలో జగన్ ధర్నా సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జగన్ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి నేతలు హాజరై మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ధర్నాలో ఎస్పీ, టీఎంసీ, శివసేన, ఏఐడిఎంకే పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్ తో పాటు ఉద్ధవ్ శివసేన ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్‌రౌత్‌, అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరై, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు జగన్ దీక్షకు హాజరై మద్దతు ప్రకటించారు. ఇండియా కూటమికి సంబంధించిన ట్విట్టర్ ఖాతాలోనూ ఈ ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో జగన్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమన్న చర్చ సాగుతోంది.

వైసీపీ అధినేత వ్యూహం అదేనా?
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమిలో లేని వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఏదో ఓ కూటమిలో చేరాలన్న నిర్ణయానికి వైసీపీ వచ్చిందా? అన్న చర్చ సాగుతోంది. అయితే.. ఎన్డీఏలో టీడీపీ కీలకంగా మారడంతో వైసీపీ ఇండియా కూటమి వైపు చూస్తుందా? అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. తద్వారా జాతీయ స్థాయిలో మద్దతు పొందడంతో పాటు, చెల్లి షర్మిలను కంట్రోల్ చేయాలన్నది జగన్ వ్యూహమన్న చర్చ జరుగుతోంది.

అన్నతో షర్మిల కలిసి పని చేస్తారా?
అయితే.. ఒక వేళ జగన్ ఇండియా కూటమిలో చేరితే షర్మిల అన్నతో కలిసి పని చేస్తారా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ లో చేరి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి షర్మిల అన్నపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. బాబాయి హత్య కేసు నుంచి.. ప్రత్యేక హోదా వరకు అనేక అంశాలపై అన్నను తూర్పార పడుతున్నారు. అన్న తనకు అన్యాయం చేశాడంటూ బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆసక్తి చూపితే.. అడ్డుకోవడానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై షర్మిల ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు?
కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల మాట వినకపోతే ఆమె తన దారి తాను చూసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఒక వేళ జగన్ ఇండియా కూటమిలో చేరి.. దీన్ని షర్మిల కూడా స్వాగతిస్తే ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే దాదాపు ఐదేళ్లుగా దూరంగా ఉంటున్న అన్నా చెల్లెళ్లు కలిసి టీడీపీపై పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే.. జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆసక్తి చూపుతారా? ఇందుకు కాంగ్రెస్ ఒప్పుకుంటుందా? కాంగ్రెస్ ఒప్పుకుంటే షర్మిల కూడా ఓకే అంటారా? అనరా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!

Advertisment
Advertisment
తాజా కథనాలు