అధికారంలో ఉన్న వారెవరైనా తమ పాలనను చూసి ఓటు వేయమని ఎన్నికల్లో కోరడం సహజం. అయితే, కొంతకాలంగా దేశంలో అధికార పార్టీలు ఏవీ తమ పరిపాలనను చూపి కాకుండా, ప్రతిపక్షాల పట్ల భయం సృష్టించడం ద్వారా, ఎన్నికల సమయంలో సరికొత్త హామీలు ఇవ్వడం ద్వారా ప్రజలను ఓటు కోరే విచిత్ర సంస్కృతిని చూస్తున్నాము.
ప్రధాని నరేంద్ర మోదీ సహితం గత తొమ్మిదిన్నర యేళ్లుగా కేంద్రంలో తమ ప్రభుత్వం సాధారణ ప్రజల జీవితాలలో తీసుకు వచ్చిన మార్పు చూసి ఓట్లు అడిగే సాహసం చేయడం లేదు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో తనను చూసి ఓటు వేయమని అంటున్నారు. ఈ మధ్య తెలంగాణాలో రెండు బహిరంగసభలలో మాట్లాడిన ఆయన `మోదీ గ్యారంటీ' అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.
అంతకు ముందు రాజస్థాన్ లో సహితం ఇదేవిధంగా ప్రధాని ప్రసంగించారు. కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ `ఐదు గ్యారంటీలు' చూపి అధికారంలోకి రాగలగడంతో మిగిలిన రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ అదేవిధంగా చేస్తున్నది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో సహితం అటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా పేదప్రజలకు తామెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పుకోవడం ఓ పరిపాటిగా మారింది. కానీ ఏ పార్టీ కూడా కీలకమైన ఉపాధి కల్పన, ద్రవ్యోల్భణం కట్టడి, అవినీతి నిర్ములన వంటి అంశాలపై మాత్రం పెదవి విప్పడం లేదు. ప్రధానంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ అంశాలలో ప్రజలకు జవాబుచెప్పే పరిస్థితులలో లేదు.
2014లో అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆయనెంతగా ప్రచారం చేసినా కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం అటువంటి ఆరోపణలపై అధికారం కోల్పోవడాన్ని అడ్డుకోలేకపోయారు. మధ్యప్రదేశ్ లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సహితం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నది.
చివరకు నేరుగా తన ప్రభుత్వం పైననే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చెలరేగడంతో ఓ విధంగా ప్రధాని ఆత్మరక్షణలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మౌలిక సదుపాయాలకల్పన ప్రాజెక్ట్ లలో తీవ్రమైన అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టులకు 150 శాతంకు పైగా రేట్లు పెంచి చెల్లించారని స్వయంగా కంట్రోలర్ ఆడిట్ జనరల్ నివేదిక వెల్లడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.
పైగా, ప్రభుత్వ ప్రాజెక్ట్ లలో అవినీతిని బట్టబయలు చేసిన కాగ్ అధికారులను కీలకమైన విధుల నుండి తప్పించడం గమనిస్తే అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రభుత్వ వ్యయంలో కనుగొన్న అక్రమాల గురించి కాగ్ ఇస్తున్న నివేదికలను అసలు పట్టించుకున్న దాఖలాలు ఉండటం లేదు.
వీటన్నింటికి మించి, తాజాగా ఈ ప్రభుత్వంలో ప్రత్యేక ప్రాధాన్యత పొందుతున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ గ్రూప్ కు సంబంధించి బొగ్గు కుంభకోణం గురించిన బ్రిటిష్ న్యూస్ పేపర్ ఫైనాన్షియల్ టైమ్స్ కధనం అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను మంటగలిపే విధంగా చేస్తున్నది.
గౌతం అదానీ ఇండోనేషియా నుంచి బొగ్గు కొనుగోలు చేస్తారని, అది భారత్ చేరేసరికి ధరలు రెట్టింపు అవుతాయని వెల్లడైనది. బొగ్గు దిగుమతుల పేరుతో అదానీ గ్రూప్ ఇంధన ధరలను పెంచి రూ. 32,000 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇటీవల ప్రధాని గ్రీస్ పర్యటనకు వెళ్ళగానే అదానీ అక్కడకు వెళ్లి ఆ ప్రభుత్వంతో ఓ ఓడరేవు విషయమై చర్చలు జరపడం కూడా అక్కడి మీడియా వెల్లడించింది. ప్రధాని జరిపే విదేశీ పర్యటనలలో పలు సందర్భాలలో అదానీ వ్యాపార ప్రయోజనాలు ముడివడి ఉంటున్నాయి.
ఇక, సిబిఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతల నోరు నొక్కేందుకు మాత్రమే ప్రయోగిస్తున్నారని, ఈ సంస్థల అధికారులు నేరుగా అధికార పక్షంలో చేరమని ప్రతిపక్ష నేతలపై వత్తిడులు తీసుకు వస్తున్నారని ఆరోపణలు చెలరేగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో పట్టుబడిన ఓ భారీ అవినీతి కేసులో కాంగ్రెస్ మంత్రిగా నెలవారీ ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ ఆధారాలు సేకరించినా, బీజేపీలో చేరడంతో హేమంత్ బిస్వా శర్మను కనీసం విచారించే ప్రయత్నం చేయలేదు. పైగా, ఆయనను అస్సాం ముఖ్యమంత్రిగా చేశారు.
మహారాష్ట్రాలో ప్రతిపక్ష ప్రభుతాన్నే కాకుండా ప్రతిపక్షాలను సహితం నిట్టనిలువునా చీల్చి, బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేసే విధంగా చేయడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలక భూమిక వహించాయి. అయితే, ఈ దర్యాప్తు సంస్థలను ప్రయోగించి డీకే శివకుమార్ వంటి వారిని ఎంతగా బెదిరించినా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటును అడ్డుకోలేకపోవడం గమనార్హం.
తెలంగాణాలో సహితం కేసీఆర్ ను ఎదుర్కోగలిగింది బిజెపి మాత్రమే అని ఆ పార్టీలో చేరిన పలువురు సీనియర్ నేతలు కేసీఆర్ కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కేసులో ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై నిర్దుష్టమైన ఆధారాలతో అవినీతి ఆరోపణలను స్వయంగా ప్రధాన మంత్రికి అందించానని, కానీ ఎటువంటి చర్య తీసుకోవటం లేదని అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాపోతున్నారు.
ప్రధాన మంత్రి మోదీ ఏ రాష్ట్రంలో బిజెపి ర్యాలీలో ప్రసంగించిన అక్కడి బీజేపీయేతర ప్రభుత్వాన్ని దేశంలోని `అత్యంత అవినీతి' ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. పైగా, కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, దారి మళ్లిస్తున్నారని, పేర్లు మార్చి తమ పథకాలుగా కేంద్ర పధకాలను చెప్పుకొంటున్నారని విమర్శలు గుప్పిస్తుంటారు.
కానీ కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఒక్క రాష్త్ర ప్రభుత్వంపై కూడా చర్యలకు ఉపక్రమించే ప్రయత్నం జరగక పోవడం గమనార్హం. పైగా, పలు అవినీతి కేసులలో అరెస్ట్ అయి, పదేళ్లుగా బెయిల్ పై ఉంటున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్రంలో బిజెపి ముఖ్యమంత్రులకు సహితం లభించని ప్రాధాన్యత లభిస్తూ ఉండడంతో తెలుగు రాస్త్రాలలో బిజెపి నాయకులు ఆత్మరక్షణలో పడే పరిస్థితులు నెలకొన్నాయి.
నేడు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరుతున్నవారిలో ఎక్కువగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉంటున్నారు. బీజేపీలో చేరిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తాయనే భయం లేకుండా సుఖంగా నిద్రపోతున్నానని పుణేలో ఓ బిజెపి నాయకుడు బహిరంగంగా చెప్పారు. `క్యాసినో కింగ్'గా పలు పొలిసు కేసులు ఎదుర్కొంటున్న ఓ నాయకుడిని పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ బిజెపి నాయకులు విముఖత వ్యక్తం చేస్తే, కేంద్రంలోని పెద్దలు వత్తిడి తెచ్చి మరీ చేర్చుకొనేటట్లు చేయడం ఇటీవలనే జరిగింది.
అందుకనే అవినీతిని రాజకీయ అస్త్రంగా బిజెపి ఇప్పుడు ఉపయోగించే పరిస్థితులు కనబడటం లేదు. చివరకు 2019లో కేంద్రంలో బిజెపి గెలుపులో కీలక పాత్ర వహించిన పుల్వామా ఉగ్రదాడి సహితం ఇప్పుడు ప్రతికూలతకు దారితీస్తుంది.
పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేండ్లకు పైగా గడిచిందని, 40 మంది జవాన్ల మృతికి దారితీసిన అధికారుల వైఫల్యానికి జవాబుదారీతనం, బాధ్యతను నిర్ణయించడంలో ప్రభు త్వం విఫలమైందని మాజీ పారామిలటరీ దళాల సంక్షేమ సంఘం జాతీయ సమన్వయకర్త రణబీర్ సింగ్ విమర్శించారు.
ఆరోపణలకు సంబంధించి జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమర జవాన్ల కుటుంబసభ్యులు వచ్చే నవంబర్ 26న దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారని ఆయన వెల్లడించారు. ఈ విషయమై అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సహితం కొద్దిరోజుల క్రితం తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ పరిస్థితులలో తననే `మోదీ గ్యారంటీ' నినాదంతో ఎన్నికలకు సిద్ధపడుతున్న బిజెపి ఏమేరకు ప్రతికూలతలు అధిగమించగలడో చూడాల్సి ఉంది. ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. `ఇందిరా ఇండియా - ఇండియా ఇందిరా' అంటూ పొగిడించుకున్న ఇందిరాగాంధీ గాని, `భారత్ వెలిగిపోతుంది' అంటూ ప్రచారం చేసుకున్న వాజపేయి సహితం అటువంటి ప్రయత్నాలు చేయలేదు.
చలసాని నరేంద్ర