Wife was Killed by her husband: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో వివాహిత హత్య కలకలం రేపింది.పెనుగొండ సమీపంలోని పంట కాలువలో మహిళ మృతదేహం లభ్యమయింది. మృతదేహం బోర్లా పడి ఉండటం, దుస్తులు చిరిగి ఉండటంతోపాటు గాయాలు ఉండటంతో స్ధానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గట్టుకు చేర్చి వివాహితగా గుర్తించి, ఎవరనే దానిపై ఆరా తీశారు.
Also Read: కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకిన వ్యక్తి .!
అడ్డపుంత పంట కాలువలో దొరికిన డెడ్ బాడీ..పెనుగొండ మండలం దొంగరావిపాలెం గ్రామానికి చెందిన నందిని(25)గా గుర్తించారు. పదునైన ఆయుధంతో ఆమె వీపు, ఎడమ జబ్బ, ఛాతిపై పొడిచి హత్యచేసిన అనంతరం పంట పొలాల మధ్య ఉన్న కాలువలో పడేసినట్టుగా భావిస్తున్నారు. తనను తాను రక్షించుకునే క్రమంలో పెనుగులాడి ఉంటుందని అందుకే ఆమె వీపుపై ఉన్న దుస్తులు చిరిగిపోయినట్టు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టారు పోలీసులు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నందిని సొంత గ్రామం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం. అయితే, కొఠాలపర్రు గ్రామానికి చెందిన చివటం రాంప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వీరు 2019లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు (18 నెలలు) దేవాంత్ ఉన్నాడు. పెనుగొండలో నివసిస్తున్న రాంప్రసాద్ పెయింటింగ్ పని చేస్తుండగా నందిని గృహణి. కుమారై హత్య సమాచారం తెలుసుకున్న తల్లితోపాటు బంధువులంతా స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బోరున విలపించారు. సోమవారం రాత్రి గౌరీపట్నంలోని తల్లి వద్దకు వెళ్దామని చెప్పి నందినిని బయటకు తీసుకొచ్చిన భర్త రాంప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు పడేవారని స్ధానికులు తెలిపారు. సోమవారం ఉదయం తణుకు వచ్చిన అత్తగారిని కలిసిన రాంప్రసాద్ తన భార్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పగా ఆమె సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. ఈలోగా క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని భావిస్తున్నారు. ఈ హత్య ఉదంతంలో భర్తతోపాటు మరెవరన్నా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భర్త రాంప్రసాద్ పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.