హైదరాబాద్ లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎక్కడికక్కడ కూల్చివేస్తోంది. ముఖ్యంగా బఫర్ జోన్లో చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా తగ్గేదే లేదంటున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. కూల్చివేతలపై తిరగబడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కూడా ఆయన లైట్ తీసుకున్నారు. దీంతో నాగేందరే దారికొచ్చారు. హైడ్రాకు మద్దతు ప్రకటించారు. ఎంఐఎం ఎమ్మెల్యే చేపట్టిన నిర్మాణాన్ని సైతం కూడ్చివేసింది హైడ్రే. అడ్డుకున్న వారిని అరెస్ట్ చేసి మారి కూల్చివేతలను కొనసాగించింది. హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్న వేళ.. జన్వాడ ఫాంహౌస్ కూడా నేలమట్టం కాబోతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో గత వారం నుంచి జోరుగా సాగుతోంది.
ఈ ఫామ్ హౌజ్ కేటీఆర్ ది అన్న ప్రచారం కూడా సాగింది. గతంలో ఈ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగురేశాడన్న కారణంతో నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ అంశంపై రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్ ను సైతం ఆశ్రయించారు. దీంతో కేటీఆర్ ఫాంహౌస్ ను కూల్చివేయబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన జన్వాడ ఫాంహౌస్ ను కూల్చివేయవద్దని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.
ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ తో పాటు లేక్ ప్రొటక్షన్ కమిటీ సభ్యులు, శంకర్ పల్లి తహసీల్దార్, రంగారెడ్డి కలెక్టర్ ను ఆయన చేర్చారు. తన ఫామ్ హౌజ్, పొలం లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు రేపటి వరకు కూల్చివేయడం చేయొద్దని ఆదేశించింది. మధ్యాహ్నం 2.15కు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైడ్రా విధివిధనాలు ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్.. జీవో 111 పరిధిలోకి హైడ్రా రాదని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనే అంశంపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొది. మరోవైపు ఈ ఫాంహౌస్ కేటీఆర్ దా? కాదా? ఈ ప్రదీప్ రెడ్డి ఎవరు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కూల్చివేతలకు భయపడి కేటీఆరే ఈ పిటిషన్ వేయించారని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్ బినామీలదే ఆ ఫామ్ హైజ్ అంటూ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తనకు ఎలాంటి ఫాంహౌస్ లేదని స్పష్టం చేశారు. గతంలో తన మిత్రుడిది లీజ్ కు తీసుకున్నట్లు చెప్పారు. ఒక వేళ ఆ ఫాంహౌస్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటే తన మిత్రుడికి చెప్పి ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించమని కొరుతానన్నారు. దగ్గర ఉండి ఆ ఫాంహౌస్ ను కూల్చివేయించే బాధ్యత తనదని స్పష్టం చేవారు. ఈ ఫామ్ హౌస్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితర నేతలందరి ఫాంహౌస్ లను పరిశీలించి వద్దామని కాంగ్రెస్ నేతలకు సూచించారు. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ను కూడా మీడియాకు చూపించడానికి కూడా తాను సిద్ధమన్నారు.
Also Read : భయపెడుతున్న మంకీపాక్స్.. కేంద్రం కీలక ఆదేశాలు