గత మార్చిలో బ్రిటన్ లో భారత జాతీయ జెండాను అవమానించిన ఖలిస్థాన్ మద్దతుదారుడు అవతార్ సింగ్ ఖండా చనిపోయాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఇతను.. చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయాడు. 15 రోజుల క్రితం అనారోగ్యంతో బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ ఆసుపత్రిలో చేరిన అవతార్ సింగ్.. శరీరమంతా విషపూరితం కావడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను ఎవరు? ఏం చేశాడు? అని నెట్టింట జనం వెతుకుతున్నారు.
ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్
అవతార్ సింగ్ ఖండా యూకే ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(KLF) చీఫ్. ఇతను యూకేలో రాజకీయ ఆశ్రయం పొందుతున్నాడు. వేర్పాటువాద ఉద్యమం వైపు సిక్కు యువతను నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. లండన్ లోని భారత రాయబార కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచిన తర్వాత అరెస్టయ్యాడు.
టెర్రర్ లింకులు
అవతార్ సింగ్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(BKI) కార్యకర్త. ఇది కెనడా, యూఎస్, యూకేతో సహా అనేక దేశాలు నిషేధించబడిన సంస్థ. స్టూడెంట్ వీసా ద్వారా యూకేలోకి ప్రవేశించాడు. ఇతనికి భారత్ లోని వేర్పాటువాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి.
పంజాబ్ తో సంబంధాలు
పంజాబ్ లోని మోగా జిల్లాలో జన్మించాడు అవతార్ సింగ్ ఖండా. చాలా చిన్న వయసులోనే లండన్ కు వెళ్లాడు. ఖలిస్తానీ ఉగ్రవాదులు పరమజిత్ సింగ్ పమ్మా, జగ్తార్ సింగ్ తారలతో సన్నిహిత సంబంధాలు.. సిక్కు యువకులకు శిక్షణ, రాడికలైజ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. భారత దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేశాడు. ఖండా తండ్రి 1991లో భద్రతా బలగాల చేతిలో చంపబడిన KLF తీవ్రవాది.
బ్రిటన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడి
లండన్ లోని భారత హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను.. ఖలిస్థాన్ అనుకూలవాదులు కిందికి దింపేసి అగౌరవపరచడంలో అవతార్ సింగ్ హస్తం ఉందని ఎన్ఐఏ తెలిపింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అనంతరం ఢిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటువాదులు.. లండన్ లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది.