నిద్రలేమి వల్ల మహిళల్లో వచ్చే సమస్యల విషయానికి వస్తే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. నిద్ర బంగారంతో సమానమన్నది కాదనలేని నిజం. వేగంగా దూసుకెళుతున్న నేటి తరంలో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, నైట్ షిఫ్టుల్లో పనిచేయడం, ఇతర కారణాల వల్ల చాలామంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా పలు సమస్యలకు కారణమవుతోంది. అందులోనూ పురుషుల కంటే స్త్రీలు 60 శాతం ఎక్కువ నిద్ర సమస్యలను అనుభవిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో హైపర్‌టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని మనం వింటూనే ఉంటాం. అయితే ఈ సమస్య వల్ల మహిళల్లో సంతాన సమస్యలు కూడా వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ప్రతి మహిళ ఇవి తెలుసుకోవాలి ప్రశాంతంగా నిద్రపోవడం అంటే ఈ రోజుల్లో అంత సుళువు కాదు. కొందరు మొబైల్ ఫోన్స్, టీవీలు చూస్తూ కావాలనే నిద్రను దూరం చేసుకుంటుంటే.. మరికొందరు బిజీ లైఫ్, ఒత్తిడి వల్ల కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. అయితే నిద్రే గగనం అవుతున్న వేళలో ఇక నాణ్యమైన నిద్ర గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. తాజాగా హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, సౌత్ ఆప్టన్ యూనివర్సిటికి చెందిన కొందరు మహిళా పరిశోధకుల పరిశోధనలో స్త్రీల నిద్ర నాణ్యత అంతగా బాగా లేదని నిర్థారణ జరిగింది. స్త్రీ శరీర గడియారం 6 నిమిషాలు వేగంగా నడుస్తుందట. అందువల్ల వీరిలో నిద్ర సమస్యలు ఎక్కువ అని వారు చెబుతున్నారు.
నిద్రలేమి వల్ల మహిళల్లో వచ్చే సమస్యల విషయానికి వస్తే శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. మహిళల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, నిద్రకు దగ్గరి సంబంధం ఉంది. ఈ రెండూ ఒక జీవ గడియారాన్ని ఫాలో అవుతుంటాయి. ఈ క్రమంలో మెలటోనిన్ అనే హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడమే కాకుండా శరీర జీవగడియారాన్ని నియంత్రిస్తుంది. జీవగడియారంలో కానీ, నిద్రలో కానీ అవాంతరాలు ఎదురైనప్పుడు ఆ ప్రభావం ప్రత్యుత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే నీలికాంతి మెలటోనిన్ హార్మోన్ విడుదలపై ప్రభావం చూపిస్తుంటుంది. దీనివల్ల అండం నాణ్యత క్షీణిస్తుంటుంది. ఇన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం నిద్రపోవడమే.కాబట్టి మహిళలు మీ ఆరోగ్యం కోసం మీరు గంట ఎక్కువ పడుకోక తప్పదు.