బీ అలర్ట్.. హడలెత్తిస్తున్న కండ్లకలక

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే కండ్లకలక కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కండ్లకలక గురించే చర్చ జరుగుతోంది. ఇది అంటువ్యాధి కావడంతో జనం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

New Update
బీ అలర్ట్.. హడలెత్తిస్తున్న కండ్లకలక

వర్షాకాలం కావడంతో సాధారణంగా సీజనల్ వ్యాధులు దరిచేరుతూ ఉంటాయి. అయితే కండ్లకలక వ్యాధి మాత్రం కాస్త భయపెడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కండ్లకలక గురించే మాట్లాడుకుంటున్నారు. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. అంటువ్యాధి కూడా కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. దీనిని ఐ ప్లూ, పింక్‌ ఐ అని వైద్యశాస్తంలో అంటారు. వర్షాకాలం సీజన్‌లో గాలిలో తేమ ఎక్కువగా ఉండే కారణంగా బ్యాక్టీరియా కళ్లను ప్రభావితం చేస్తుందని.. ఫలితంగా కండ్ల కలక బారిన పడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, విద్యార్థులు కండ్లకలక బారిన పడుతూ ఉంటారని పేర్కొన్నారు. అయితే పలు జాగ్రత్తలు తీసుకుంటే కండ్లకలక నుంచి రక్షించుకోవచ్చని వెల్లడిస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా కండ్లకలక బారినపడ్డారు. తనకు కండ్లకలక సోకిందని ఆయన వెల్లడించారు. కండ్లకలక కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కండ్లకలక లక్షణాలు.. 

కళ్లు ఎర్రగా మారతాయి. కంటిరెప్పలు వాపుగా అవుతాయి. కంటి నొప్పితో పాటు దురద, మంట వస్తాయి. కంటి నుంచి ఆగకుండా ఊసులు రావడం, కాంతిని చూడలేకపోతారు. కంటి నుంచి నీరు వస్తూ ఉంటుంది. కండ్లకలక అనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వేగంగా వ్యాపించే వైరస్. ఇది తరచుగా బాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కంటి నుంచి స్రావాల ద్వారా వస్తుంది.ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. అందుకే కండ్లకలక వున్నవారికి దూరంగా ఉండడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

కండ్లకలక వచ్చిన వారు కంటిని తరచూ మంచినీటితో కడుక్కోవాలి. మిగతా వారికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధి సోకిన వారు వాడిన వస్తువులను ఇతరులు వాడకూడదు. మురికి చేతులతో కళ్లను తాకకూడదు. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. కళ్లు దురదగా అనిపిస్తే తరుచూగా రుద్దకూడదు. వైద్యుల సూచన మేరకు ఐ డ్రాప్స్ వాడితే మంచిది. కండ్లకలక వచ్చిన వారు తప్పనిసరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేయి లేదా కర్చీఫ్ అడ్డుపెట్టుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కండ్లకలక లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు