VVS Laxman: హ్యాపీ బర్త్‌డే..! కంగారులను కంగారు పెట్టించిన లక్ష్మణుడు..!

ఇవాళ(నవంబర్‌ 1) టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, వెరీ వెరీ స్పెషల్‌ ప్లేయర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ బర్త్‌డే. 49వ బర్త్‌డే జరుపుకుంటున్న లక్ష్మణ్‌కు అభిమానులు, ఆటగాళ్లు విషెస్‌ చెబుతున్నారు.

New Update
VVS Laxman: హ్యాపీ బర్త్‌డే..! కంగారులను కంగారు పెట్టించిన లక్ష్మణుడు..!

మార్చి 13, 2001..
వేదిక- ఈడెన్‌ గార్డెన్స్‌
ప్రత్యర్థి జట్టు- ఆస్ట్రేలియా

భారత్‌, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య సెకండ్‌ టెస్ట్ జరుగుతోంది. అప్పటికే టీమిండియా ఫాలో అన్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 రన్స్ చేసింది. ఇండియా 171 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఫాలో అన్‌లో కూడా ఇండియా ఇలానే అవుట్ అవుతుందని అంతా భావించారు. ప్రపంచంలోనే మేటి టీమ్‌ ఆస్ట్రేలియా. అప్పటివరకు ఆసీస్‌ బౌలింగ్‌ దళంపై తిరుగులేని రికార్డులు కలిగి ఉన్న ఒకే ఒక ఆటగాడు సచిన్‌.. అయితే ఈడెన్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సచిన్‌ 10పరుగులకే అవుట్ అయ్యాడు. ఇంకేముంది.. అందరూ సైకిల్‌ స్టాండ్‌లా పెవిలియన్‌కు చేరుకుంటారని అభిమానులు ఫిక్స్‌ ఐపోయారు. కొంతమంది టీవీలు కూడా ఆఫ్‌ చేశారు. కానీ వేలాది మందితో కిక్కిరిసిపోయిన ఈడెన్‌ క్రౌడ్‌కు మాత్రం ఏదో హోప్‌.. ఇండియాను గెలిపించడానికి.. ఎవరో వస్తారని.. అక్కడే కూర్చుండిపోయారు.

బెంగాల్‌ గడ్డపై తెలుగు కుర్రాడి విశ్వరూపం:
232 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది టీమిండియా..గంగూలీ కూడా అవుట్. ఈడెన్‌ అభిమానుల గుండె పగిలింది. దాదా అవుట్ అవ్వడంతో అంతా నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే సమయం పెరుగుతున్న కొద్దీ వారి నిరాశ ఆశగా మారింది. వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లక్ష్మణ్‌ (VVS Laxman)..ద్రవిడ్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తున్నాడు. ఆసీస్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. చూడముచ్చటైన షాట్లతో అలరిస్తున్నాడు.. వెన్నునొప్పితో.. గాయంతో బాధపడుతూనే ఆ మ్యాచ్‌లో బరిలోకి దిగిన లక్ష్మణ్‌ తన ఆటతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్నాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను నిలబెట్టడమే కాదు.. గెలిపించాడు. లక్ష్మణ్ డబుల్ సెంచరీ(281), ద్రవిడ్‌ సెంచరీ(180) 657/7 స్కోరు చేసి డిక్లెర్ చేసింది. 384 పరుగుల టార్గెట్‌తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా 212 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది చిరస్మరణీయ విజయం.

publive-image టీనేజ్ లో లక్ష్మణ్ (Pic/Ashish Raje)

బెస్ట్ ఇన్నింగ్స్:
టెస్టు క్రికెట్‌లో సెహ్వాగ్‌ రెండు డబుల్ సెంచరీలు చేసి ఉండొచ్చు.. సిడ్నీ గడ్డపై సచిన్‌ 241 పరుగులు చేసి ఉండొచ్చు.. కానీ భారత్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై లక్ష్మణుడు చేసిన 281 పరుగులే అన్నిటికంటే బెస్ట్... అన్నిటికంటే స్పెషల్‌.. తన 17 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి ఎన్నో స్పెషల్‌ ఇన్నింగ్స్‌లు ఆడిన టీమిండియా వెరీ వెరీ స్పెషల్‌ బ్యాటర్‌ వంగిపురపు వెంకట సాయి లక్ష్మణ్ బర్త్‌డే ఇవాళ. 49వ బర్త్‌డే జరుపుకుంటున్న లక్ష్మణ్‌కు అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని విద్యావంతుల కుటుంబంలో పుట్టిన లక్ష్మణ్‌ తన డాక్టర్‌ వృత్తిని కాదనుకోని మరి క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఓటమి అంచుల్లో.. అసలు గెలవడమే సాధ్యం కాదనుకున్న మ్యాచ్‌లను ఒంటిచెత్తో గెలిపించిన ఆపద్బాంధవుడు లక్ష్మణ్‌. సహచర ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పిన లక్ష్మణ్‌ భారత్‌ క్రికెట్‌పై చెరిగిపోని ముద్రవేశాడు.

publive-image లక్ష్మణ్ చిన్ననాటి ఫొటో

ఆస్ట్రేలియా పాలిట యముడు:
ప్రపంచ క్రికెట్‌ను ఆస్ట్రేలియా డామినెట్ చేస్తున్న కాలంలో మన లక్ష్మణ్‌ వారి పాలిట యముడిగా మారాడు. సచిన్‌ వికెట్ పడితే సరిపోదు.. లక్ష్మణ్‌ వికెట్ కూడా పడితేనే గెలిచినట్లని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు డ్రెస్సింగ్‌ రూమ్స్‌లో చర్చించుకునేవారంటే లక్ష్మణుడి ఆట ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గాయంతో బాధపడుతున్నా క్రీజులోకి వచ్చి మ్యాచ్‌లను గెలిపించిన పోరాట యోధుడు మన తెలుగు వీరుడు. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ప్లాన్లు సైతం లక్ష్మణ్‌ విషయంలో పూర్తిగా బెడిసికొట్టాయంటే కంగారులను మనోడు ఎంత కంగారు పెట్టాడో ఊహించుకోవచ్చు. 1996లో టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మణ్‌ తన కెరీర్‌లో 134 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో 8,781 పరుగులు చేసిన లక్ష్మణ్‌ 17 సెంచ‌రీలు, 56 హాఫ్‌ సెంచరీలు చేశాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా లక్ష్మణ్ రిటైర్‌మెంట్ ప్రకటించి 11ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన ఆడిన ఇన్నింగ్స్‌ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకునే ఉన్నాయి. భారత్ ఆటగాళ్లలో, ముఖ్యంగా తెలుగు యువతలో లక్ష్మణ్‌ నింపిన స్ఫూర్తి అలానే కొనసాగాలని ఆశిస్తూ ఆర్టీవీ(RTV) లక్ష్మణ్‌కు వెరీ వెరీ స్పెషల్‌ విషెస్‌ చెబుతోంది.

Also Read: పాకిస్థాన్ కెప్టెన్ వాట్సాప్ ఛాటింగ్ లీక్.. అందులో ఏముందంటే..!

Advertisment
తాజా కథనాలు